1.07 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం

20 Oct, 2020 04:30 IST|Sakshi

రైతులను ఆదుకునేందుకు సీఎం ఆదేశాలు 

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

కాకినాడ రూరల్‌: రాష్ట్రంలో గత మూడు నెలలుగా వరదలు రావడంతో 9 జిల్లాల పరిధిలో సుమారు 1,07,797 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్‌ కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో రైతులు పంటలు నష్టపోయారన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► 13,563 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 2,974 హెక్టార్లలోని చేపలు చెరువులు, మత్స్యకారులకు చెందిన 478 బోట్లు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, ముంపు ఇళ్లలోని వారికి ఉచితంగా నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు సీఎం జగన్‌ ఆదేశించారు.
► 2019 వరదలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.42 కోట్లు విడుదల చేశాం.

లోకేష్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరం..
► ప్రభుత్వంపై టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. గత నవంబర్, డిసెంబర్‌ వరదలకు రూ.125.20 కోట్లు, 2020లో రూ.54 కోట్లు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే ఏమీ ఇవ్వలేదని లోకేష్‌ అబద్ధాలు చెబుతున్నారు.
► వడ్డీ రాయితీ కింద రూ.1,074 కోట్లు, రైతు భరోసాతోపాటు చంద్రబాబు హయాంలోని బకాయిలనూ ఇచ్చాం.
► వరదలకు తూ.గో. జిల్లాలో 64 మంది చనిపోయారని, రాష్ట్రంలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని లోకేష్‌ చెబుతున్నవి కాకి లెక్కలు.     రైతులకు విత్తనాలు ఇవ్వని చెత్త ప్రభుత్వమంటూ లోకేష్‌ చేసిన వ్యాఖ్యలనూ ఖండిస్తున్నాం. సీజన్‌కు ముందే విత్తనాలు పంపిణీ చేశాం. 

మరిన్ని వార్తలు