రైతుకోసం కాదు.. రైతుమోసం కోసం టీడీపీ

14 Sep, 2021 04:01 IST|Sakshi

అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతల్ని పట్టించుకోని చంద్రబాబు

ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే గోళ్లుగిల్లుకున్న బాబు

జగన్‌ చెబితే చేస్తాడని రైతుల నమ్మకం

వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు 

కాకినాడ రూరల్‌: రైతులను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లడానికి రైతుకోసం తెలుగుదేశం అని టీడీపీ ఒక కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిసిందన్నారు. 14 ఏళ్ల పాలనలో ఏనాడూ రైతులకు మేలు చేయని పాలన సాగించి ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత  సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే చంద్రబాబు ఆ రోజు హేళనగా తీగలపై బట్టలు ఆరవేసుకోవాలని రైతులను కించపరిచారని గుర్తుచేశారు. రైతులకు సంకెళ్లు వేసి రోడ్డుపై నడిపించారని, కాల్పులు జరిపి ప్రాణాలు హరించారని చెప్పారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 2014లో ఏం ఒరగబెట్టారో రైతులకు తెలుసన్నారు. కమిటీలు వేసి రూ.87 వేల కోట్లంటూ కేవలం రూ.15 వేల కోట్లు మాఫీచేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. 62 శాతం వ్యవసాయ ఆధారిత జనాభా ఉన్న రాష్ట్రంలో రైతులు నమ్మి ఉంటే టీడీపీకి 23 సీట్లు మాత్రమే ఎందుకొస్తాయో అని ప్రశ్నించుకోవాలన్నారు. రైతుకోసం తెలుగుదేశం కాదు.. రైతు మోసం కోసం తెలుగుదేశం అని సదరు కార్యక్రమం పేరు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.

వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న సీఎం జగన్‌
చంద్రబాబు వ్యవసాయాన్ని దండగ చేస్తే.. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు క్రాప్‌హాలిడే కూడా ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సీఎం జగన్‌ రైతుపక్షాన వివిధ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతుభరోసా కేంద్రాలను (ఆర్‌బీకేలను) దేశం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోందన్నారు. రూ.3 వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ప్రకృత్తి విపత్తుల సహాయనిధి ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర మద్దతు ధరలు కాకుండా రాష్ట్రంలో ఏడు పంటలకు సీఎం కనీస మద్దతు ధర ప్రకటించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఇవేమీ పట్టకుండా మీ విన్యాసాల మీడియా మద్దతుతో మహానాయకులుగా, బాహుబలిగా చెలామణి అవ్వాలనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబును చూస్తే 70 ఏళ్ల అబద్ధం నడిచివస్తున్నట్టు ఉంటుందన్నారు. బాబు బకాయిపెట్టిన రూ.1,400 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్‌ చెల్లించారని చెప్పారు. విత్తన బకాయిలు రూ.380 కోట్లు చెల్లించామన్నారు. చంద్రబాబు బకాయిలు తీర్చేందుకే తమ ప్రభుత్వానికి సరిపోతోందన్నారు. రైతులకు జగన్‌ వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు చెబుతున్నారని, ఆయనలా జగన్‌కు వెన్నుపోట్లు చేతకాదని పేర్కొన్నారు. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబేనన్నారు. సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే.. అని రైతులు నమ్ముతున్నారని తెలిపారు. 

రెట్టింపు సంఖ్యలో రైతుల నమోదు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 వరకు ఫార్మర్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేవలం 60.84 లక్షలు మాత్రమే ఉందని చెప్పారు. తమ  ప్రభుత్వంలో రెండేళ్లలో 121.11 లక్షలమంది నమోదయ్యారని తెలిపారు. టీడీపీ పాలనలో 773 మంది రైతుల ఆత్మహత్యల కేసులు మూసివేసిందని, తమ ప్రభుత్వం వాటిని విచారించగా 466 సంఘటనల్లో నిరూపణ అవడంతో బాధితులకు రూ.23.30 కోట్లు ఇచ్చామని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, విభజన హామీగా జాతీయ హోదాగా తెచ్చుకుంటే.. ఆ పనులు చేస్తామని కక్కుర్తిపడి చివరికి ఏం చేశారని నిలదీశారు. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి చంద్రబాబుకు పోలవరం ఏటీఎంగా మారిందని సర్టిఫికెట్‌ ఇచ్చారని గుర్తుచేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును పెంచుతుంటే యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనరుగా ఉన్న చంద్రబాబు గోళ్లుగిల్లుకున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ దాహార్తి, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు గురించి బాబు ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపడుతుంటే చంద్రబాబు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో లేఖలు రాయించారని గుర్తుచేశారు. 2018 నాటికి చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్ర రైతులు అత్యధికంగా అప్పులు ఉన్నవారిగా నిలవాల్సి వచ్చిందని చెప్పారు.

17కు డ్రిప్‌ ఇరిగేషన్‌ టెండర్ల ప్రక్రియ పూర్తి
అవినీతి ఆరోపణలు రావడంతో నిలిపేసిన డ్రిప్‌ ఇరిగేషన్‌ టెండర్ల ప్రక్రియ ఈనెల 17కు పూర్తవుతుందని, అక్టోబరు 1నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం జూలై 8న రైతు దినోత్సవంనాడు రూ.1,300 కోట్లకుపైగా వెచ్చించేందుకు జీవో ఇచ్చామన్నారు. మూడు ఫార్మ్‌ మెకనైజేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్లను నెలకొల్పుతున్నామని, వచ్చే సీజన్‌ నుంచి ఇండివిడ్యువల్‌ టూల్స్‌ ఇవ్వమని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. మంత్రుల శాఖలపై మాజీ మంత్రి సోమిరెడ్డి  చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కంప్యూటర్‌ కనిపెట్టాడని లోకేశ్‌కు ఐటీశాఖ ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతు గుండె చప్పుడు వినగలిగే నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు