ప్రతి రైతునూ ఆదుకుంటాం

29 Sep, 2021 04:53 IST|Sakshi

గులాబ్‌ తుపానులో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం 

ప్రాజెక్టులు నిండి పంటలు బాగుంటే టీడీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు 

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 

సాక్షి, అమరావతి: గులాబ్‌ తుపానుతో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతునూ ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఒక్క ఎకరా పంటను కూడా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే జరిగిన నష్టంపై ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు. అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నాయని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు ప్రాజెక్టులు నిండి పంటలు బాగుంటే ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో వ్యవసాయం సంక్షోభంలో ఉందంటూ గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏ మాత్రమైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. గత రెండేళ్లలో సీఎం జగన్‌ వ్యవసాయానికి అత్యధిక కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. 

‘కాలువ’వి అర్థం లేని విమర్శలు 
వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఇతర పంటలు వేస్తున్నారన్నారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఏనాడైనా అక్కడి ప్రాజెక్టుల గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. చివరకు హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌కు రాయలసీమ దుస్థితి తెలుసు కాబట్టే ఇక్కడి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాయలసీమ రైతుల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు.  

సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాం.. 
మూడు రోజుల నుంచి గులాబ్‌ తుపాను వల్ల పలుచోట్ల పంట నష్టం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో పంటలు నీట మునిగాయని తెలిపారు. ఇప్పటివరకు 1,56,756 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అత్యధికంగా 1,16,823 ఎకరాల్లో వరి, 21,078 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నాయన్నారు. అపరాలు, వేరుశనగ, పత్తి పంటలకు కూడా నష్టం జరిగిందన్నారు. కృష్ణా జిల్లాలో 10,588 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందని చెప్పారు. 7,207 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా దాదాపు 6,800 మంది రైతులు నష్టపోయారని తెలిపారు.

రైతులు ఒక్క ఎకరం నష్టపోయినా ఆదుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. 169 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనాకు వచ్చామన్నారు. ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించి, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2014–2019 వరకు ధాన్యం సేకరణ, వరి కాకుండా మిగతా పంటలు చూస్తే.. అప్పటి టీడీపీ ప్రభుత్వం 11,22,912 మెట్రిక్‌ టన్నుల పంటలను రూ.3,921 కోట్లతో కొనుగోలు చేసిందన్నారు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే 19,39,987 మెట్రిక్‌ టన్నుల «పంటలను మొత్తం రూ.6,454 కోట్లతో కొనుగోలు చేసిందని చెప్పారు.     

మరిన్ని వార్తలు