చంద్రబాబుపై ప్రేమతో రోజూ అసత్యాలేనా?

25 Nov, 2020 03:29 IST|Sakshi

ప్రభుత్వంపై బురద చల్లడమే ఈనాడు ధ్యేయమా?

పంటల బీమా కథనంపై మంత్రి కన్నబాబు మండిపాటు  

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను పక్కన పెట్టి ‘ఈనాడు’ పత్రిక బురద చల్లే తప్పుడు కథనాలను వండి వారుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. మంగళవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ‘బీమా సొమ్ముతోనే భరోసా!’ పేరుతో ఈనాడు ప్రధాన సంచికలో సత్యదూరమైన కథనాన్ని ప్రచురించిందన్నారు. అవినీతికి తావు లేకుండా పంట నష్టం పరిహారాన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంటే దీన్ని మరుగున పెట్టి చంద్రబాబును మోసే ప్రయత్నంలో విషం కక్కడం సరికాదన్నారు.

చంద్రబాబు హయాంలో రైతులకు పంటల బీమా సొమ్ము చెల్లించకుండా ముఖం చాటేశారన్నారు. చంద్రబాబుపై ప్రేమను చాటుకునేందుకు ప్రతి రోజూ ప్రభుత్వంపై అవాస్తవ కథనాలు ప్రచురించాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.277.67 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా మొత్తాన్ని రైతుల పక్షాన చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అక్టోబర్‌లోనూ, అక్టోబరు నెలకు సంబంధించి నవంబరులో చెల్లించడం చరిత్రలో రికార్డని మంత్రి పేర్కొన్నారు. 21 రకాల పంటలకు దిగుబడి ఆధారంగా నష్టాన్ని అంచనా వేయగా మిగిలిన 9 రకాల పంటలను పర్యావరణం ఆధారంగా గుర్తించి పరిహారాలను అందజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36 వేల నమూనాల పరిశీలన ద్వారా నష్టాన్ని అంచనా వేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు