ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది బాబు, యనమల

15 Oct, 2021 02:29 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు, చిత్రంలో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్, కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాయుడుబాబు 

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థను అథోగతిపాలు చేసిన ఘనత చంద్రబాబు, యనమల రామకృష్ణుడులదేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ప్రజలంతా దసరా పండుగ హడావుడిలో ఉంటే.. చంద్రబాబు బ్యాచ్‌ కడుపుమంటతో ఇళ్లల్లో కూర్చుని అబద్దపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకొంటోందని విమర్శించారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల అప్పుతెచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. ఎప్పుడైనా ఒక్కపైసా పేద కుటుంబానికి సాయం చేశారా.. అని నిలదీశారు. తెచ్చిన అప్పు మొత్తాన్ని హారతి కర్పూరంలా చేసిన మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడతారా అని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిధులు సమకూర్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి పాత పథకమని, టీడీపీ కూడా అమలు చేసిందని యనమల చెప్పడం సిగ్గుచేటన్నారు. ‘మీ బతుకంతా నారాయణ, చైతన్య కార్పొరేట్‌ కాలేజ్‌లు, వాళ్ల స్కూళ్లు బాగుచేయడమే తప్ప.. ప్రభుత్వ పాఠశాలల గురించి ఏనాడైనా ఆలోచించారా..’ అని ఎద్దేవా చేశారు.  

నేరాలు బయటపడతాయనే నలుగురు ఎంపీలను బీజేపీలో కలిపారు 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తమ ఆర్థిక నేరాలు ఎక్కడ బయటపడతాయోనని ఉన్న నలుగురు ఎంపీలను ఆ పార్టీలో కలిపేసిన మీరు ఆర్థిక నేరాల గురించి మాట్లాడతారా అని విమర్శించారు. తమ నాయకుడు ఇచ్చిన హామీ ప్రకారమే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారని చెప్పారు. లిక్కర్‌బాబు అయ్యన్నపాత్రుడు లిక్కర్‌ ధర పెరుగుతోందని మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కరెంట్‌ సంక్షోభం రానుందని నిపుణులు సైతం చెబుతున్నారన్నారు. మన రాష్ట్రంలోనే కరెంట్‌ కష్టాలు ఉన్నట్లు చంద్రబాబు ప్రజలను తప్పుదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 200 యూనిట్ల కరెంట్‌ ఉచితంగా కరెంట్‌ ఎక్కడ ఇచ్చారని మాట్లాడుతున్న యనమల, అయ్యన్నపాత్రుడుల కళ్లు మూసుకుపోయాయా.. అని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 1,25,791 మంది ఎస్టీ గృహ వినియోగదారులకు, 35,148 మంది ఎస్సీ గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉన్నవారికి ఉచితంగా కరెంటు ఇస్తున్నామని చెప్పారు. నీతిఆయోగ్‌ సైతం ఆర్‌బీకేలను ప్రశంసించిందన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. గతేడాది రూ.500 కోట్ల  నష్టం వస్తే ప్రభుత్వం రీయింబర్స్‌ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్, కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు, వైఎస్సార్‌సీపీ నాయకుడు జోగినాయడు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు