కలిసి కాపురం చేయడానికి ఇంత సీన్‌ సృష్టించాలా?

19 Oct, 2022 04:36 IST|Sakshi

ఇంతకాలం చంద్రబాబు, పవన్‌లది రహస్య ప్రేమ 

మేం బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకుంటే.. నువ్వు బాబును తీసుకుంటావా? 

మాజీ మంత్రి కన్నబాబు ధ్వజం 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లది ఇంతకాలం రహస్య ప్రేమ అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇద్దరూ కలిసి కాపురం చేయడానికి ఇంత సీన్‌ సృష్టించాలా అని నిలదీశారు. బాబును సీఎంగా చేయడానికే రాజకీయాలు చేస్తున్నారు తప్పించి పవన్‌ సీఎం కావడానికి చేయడం లేదనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. ఆయన మంగళవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణ, మూడు రాజధానులు ఉండాలి, ఎంతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలనే మహదాశయంతో విశాఖ గర్జన ద్వారా ప్రజలు వారి ఆకాంక్షలు ప్రతిబింబింపచేశారని చెప్పారు. శాంతిభద్రతల సమస్య వచ్చినప్పుడు, మంత్రులపై దాడి జరిగితే ఏ విధంగా స్పందించాలో తమ ప్రభుత్వం అదే చేసిందని పేర్కొన్నారు. కన్నబాబు ఇంకా ఏమన్నారంటే...  

రాజకీయాలంటే సినిమాలు కాదు 
విశాఖ గర్జన రోజున చంద్రబాబు అండ్‌ కో తప్పెటగుళ్లతో రాద్ధాంతం చేయడం మొదలుపెట్టారు. ఈ రోజు ఉదయం నుంచి టీవీల్లో పవన్‌ ఏకపాత్రాభినయం చూస్తున్నాం. సినిమాల్లో క్‌లైమాక్స్‌ సీన్ల మాదిరిగా చాలా ఉద్రేకంగా, హుషారుగా ఎదుటి వారంతా విలన్లు అన్నట్టుగా ఊహించుకుని పెద్ద సీన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. పవన్‌ ఇదేమీ సినిమా కాదు. ఇది వాస్తవం. సినిమాలో మీ డైలాగులు చూస్తే చప్పట్లు కొడతాం. కానీ, వాస్తవంలో ఆ సీన్లు రిపీట్‌ చేస్తే చూస్తూ ఊరుకోం.

సినిమాలో డైలాగులు కొట్టడం, మీరు చెయ్యి విసిరితే విలన్లు గాలిలో ఎగిరిపోవడం, డైరెక్టర్‌ కట్‌ చెబితే మీకు టచ్‌అప్‌లు ఇచ్చేవారు ఇక్కడ ఉండరని తెలుసుకోవాలి. కుమ్మేస్తా, పొడిచేస్తా... వంటి డైలాగులు సినిమాలో బాగుంటాయి. నిజజీవితంలో, రాజకీయాల్లో ఇవేమీ పనిచేయవు. ఇంతకాలం రహస్యంగా ప్రేమించుకుని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు పెద్దల ముందు ఆ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయడానికి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తోంది.

ఇకముందు కలిసి కాపురం చేస్తున్నామని చెప్పడానికి ఇంత సీన్‌ క్రియేట్‌ చేయాలా? ఇప్పుడు కొత్తగా స్టేజీపైకి వచ్చి మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు. మీ ముసుగు తొలగిపోయింది. 2014లో పార్టీ పెట్టి పోటీచేశారా? చివరకు ప్రజాశాంతి పార్టీ కూడా పోటీచేసిందే. 2019 వచ్చేసరికి చంద్రబాబు అధికారంలో ఉండటంతో వ్యతిరేక ఓటు చీలిపోకుండా విడిగా పోటీచేసి బాబుకు దాసోహం అనిపించుకున్నారు.

జనసేన పార్టీ బీ ఫారాలు  తెలుగుదేశం అభ్యర్థుల చేతుల్లో పెట్టి మీకు నచ్చినవారి పేర్లు రాసుకోండని చెప్పిన చరిత్ర తరవాత బయటకు వచ్చింది. 2024కు వచ్చేసరికి కలిసే పోటీచేస్తారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇందుకోసం ఒక డయాస్‌ సృష్టించడం. వైఎస్సార్‌సీపీని విలన్‌గా చూపించి తానేమో పెద్ద హీరో మాదిరిగా అనుకోవడం సిగ్గుచేటు. వైఎస్సార్‌సీపీలో ఉన్న ఎమ్మెల్యేలంతా విలన్లు.. వారితో పోరాటం చేస్తోన్న హీరో పవన్‌అన్నట్టు సీన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. జనం మిమ్మల్ని రాజకీయాల్లో జీరో అనుకున్నారు. కాబట్టే ఆ ఫలితాలు వచ్చాయి. కానీ వైఎస్‌ జగన్‌ను రాష్ట్ర ప్రజలు హీరో అనుకున్నారు కాబట్టే 151 సీట్లు ఇచ్చారు.  

కాపులకు బ్రహ్మనాయుడు..నీకు చంద్రబాబు ఆదర్శం 
కాపులంతా బ్రహ్మనాయుడును ఆదర్శంగా తీసుకోమని చెబుతున్నావ్‌. మేము బ్రహ్మనాయుడును ఆదర్శంగా తీసుకుంటాం.. నువ్వు మాత్రం చంద్రబాబును ఆదర్శంగా తీసుకో. ఈ రోజు బ్రహ్మనాయుడు చరిత్ర తెలిసిందా పవన్‌. 2019లోనే అధికారంలోకి వచ్చి తొలి కేబినెట్‌లోనే జగన్‌మోహన్‌రెడ్డి దళిత మహిళను హోం మంత్రిని చేశారు. మంత్రివర్గ మార్పుల్లో మాదిగ సామాజికవర్గం నుంచి మరో మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చారు. కేబినెట్‌లో ఉన్న 25 మందిలో ఐదుగురు కాపులున్నారు.  

నీ పక్కన కూర్చునే అర్హత కాపులకు లేదా? 
రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి తిడుతూనే ఉన్నావు కదా. ఒక్కరోజు అయినా కాపుల సంక్షేమం కోసం మాట్లాడావా? కాపులను నేను రమ్మన్నానా, మద్దతు ఇవ్వమన్నానా.. అని ప్రశ్నించిన పెద్దమనిషి ఈ రోజు కాపుల కోసం అంటూ మాట్లాడటం సిగ్గు చేటు. తన పక్కన కుర్చీ వేసి కమ్మ సామాజికవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌ను కూర్చోబెట్టావే తప్ప ఏ ఒక్క కాపు నాయకుడిని అయినా కూర్చోబెట్టావా? మీ పక్కన కూర్చోబెట్టుకునేందుకు కాపులకు అర్హత లేదా? మీరు ఉపన్యాసాలు దంచుతుంటే చెవిలో పువ్వులు పెట్టుకుని మేము వినాలా.

మీ పార్టీని ఎవరు నడిపిస్తున్నారో, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత ఎవరెవరో అందరికీ తెలుసు. వంగవీటి రంగా హత్య గురించి మాట్లాడుతున్నారు. రంగా హత్య జరిగినప్పుడు నాటి హోం మంత్రి హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో టీడీపీ అధినేత చంద్రబాబే సూత్రదారి అని రాసిన విషయం తెలియదా. అటువంటి చంద్రబాబు చంకలో కూర్చుని రంగా హత్యపై కన్నీరు కార్చడం చూస్తుంటే బాధేస్తోంది. ముద్రగడను కాపులు ఒక ఐకాన్‌గా చూస్తారు. ఆ కుటుంబాన్ని తప్పుగా మాట్లాడి హింసించి క్షోభకు గురిచేసిన చంద్రబాబు సర్కార్‌పై ఒక్క రోజైనా స్పందించి ఒక్క స్టేట్‌మెంట్‌ ఇచ్చావా? 

ఎప్పుడూ చంద్రబాబు చంకలోనే.. 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆయన చంకలోనే ఉన్నారు. పైకి పోరాటం, పటిమ అనే మాటలు తప్ప చంద్రబాబు కబంధ హస్తాల నుంచి బయటకు రాలేరని ప్రజలు భావిస్తున్నారు. లేకపోతే ఇంత రాజీపడిపోయి, సాగిలపడిపోయి చంద్రబాబు బూట్లు నాకే పరిస్థితికి ఎందుకు రావాలి? అంత చెంచాగిరి ఎందుకు చేయాలి? నాడు 33 వేల ఎకరాలు ఎవరి కోసం సేకరిస్తున్నారు? ఇది ఒక కులానికి రాజధానిలా ఉంది అని చెప్పిన మీరే ఇప్పుడు మాట మార్చారు.

అసలు విశాఖపట్నంలో గర్జన జరిగిన రోజే మీరు అక్కడికి రావలసిన అవసరం ఏముంది? హోటల్‌కు ర్యాలీగా వెళ్లాల్సిన పని ఏమిటి? డైవర్షన్‌ పాలిటిక్సే కదా? జోగి రమేష్, రోజాపై దాడి నేపథ్యంలో పోలీసులు మిమ్మల్ని నియంత్రిస్తే.. ఆ విషయాన్ని వదిలేసి కాపు ఎమ్మెల్యేలు అంటూ మమ్మల్ని బూతులు తిట్టడం ఏమిటి? దాడిచేసింది నీ పార్టీవాళ్లే. నీ మద్దతుదారులే. అక్కడ అల్లరి చేసింది మీరే.. ఒక మహిళా మంత్రిమీద, ఒక బీసీ మంత్రిమీద దాడిచేసినా కనీసం క్షమాపణ చెబుదామన్న జ్ఞానం కూడా లేదు. పైగా వైఎస్సార్‌సీపీలో ఉన్న కాపు నాయకులను బూతులు తిట్టడం. సంస్కారానికి సంబంధించిన విషయం ఇది.   

మరిన్ని వార్తలు