బాబువి నిన్న కుల, నేడు మత రాజకీయాలు

10 Sep, 2020 14:52 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అంతర్వేది రథం దగ్ధం విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియోతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఎవర్నీ ఉపేక్షించాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. దీన్ని చంద్రబాబు లాంటి వారు రాజకీయాలకు వాడుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. నిన్నటి వరకు కుల రాజకీయాలు చేసి, నేడు మత రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారి ఆశలు నెరవేరవని, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సంఘటనపై స్పందించిందని గుర్తు చేశారు. అధికారులను సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తోందని తెలిపారు. కొత్త రథానికి నిధులు కూడా కేటాయించిందని చెప్పారు. చదవండి: (రథం చుట్టూ రాజకీయం!)

ఆనాడు చంద్రబాబు సమక్షంలోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. విజయవాడలో దేవాలయాలను కూల్చి వేసింది మర్చిపోయారని అనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఆ రోజు పరిశీలనకు వచ్చిన స్వామీజీలను అరెస్ట్ చేసింది చందబాబు కాదా అని నిలదీశారు. నిన్నటి వరకు పవన్ కల్యాణ్ బాబు బాటలో నడిచారని, నేడు బీజేపీ బాటలో నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరైనా సరే ప్రభుత్వం ఎక్కడ లోపం లేకుండా విచారణ చేస్తోందని వివరించారు. మత రాజకీయాలు చేయాలనుకునే వారి ఆశలు నెరవేరవని తెలిపారు.

మరిన్ని వార్తలు