గౌరు వర్సెస్‌ మాండ్ర: బావా బామ్మర్దుల మధ్య పెరిగిన దూరం

15 Jul, 2021 14:48 IST|Sakshi

ఇరు కుటుంబాల మధ్య వాదోపవాదాలు 

మాండ్రతో రాజకీయంగా  నష్టపోయానని గౌరు ఆరోపణ 

సాయాన్ని మరిచి నిందలు మోపడంపై గౌరు సోదరి భగ్గు  

విభేదాలపై జిల్లాలో జోరుగా చర్చ

బావబామ్మర్దులైన గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య దూరం పెరిగిందా? టీడీపీ అధిష్టానం మాండ్రను పూర్తిగా పక్కన పెట్టిందా? మాండ్ర కారణంగా తాను రాజకీయంగా నష్టపోయానని గౌరు తన బావ, సోదరితో వాదనకు దిగారా? మాండ్ర జిల్లా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారా? ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. గౌరు   వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య మాటలు లేవని, దూరం పెరిగిందని వారి సన్నిహితులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.     – సాక్షిప్రతినిధి, కర్నూలు

 విభేదాలకు ఇదీ కారణం..  
టీడీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా కొన్ని నెలల క్రితం గౌరు వెంకటరెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ నియామకంపై టీడీపీ తరఫున        నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాండ్ర శివానందరెడ్డికి అధిష్టానం మాటమాత్రం కూడా చెప్పలేదు. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని మాండ్ర గమనించారు. గత నెల 18న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి రాగా.. మాండ్ర గైర్హాజరయ్యారు. పైగా గౌరు ఇంటికి కూడా వెళ్లడం మానేశారు. ఇటీవల మాండ్ర, గౌరు కుటుంబాల మధ్య వాదులాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. 
 
మాండ్ర వైఖరితో తీవ్రంగా నష్టపోయామనే భావనలో గౌరు 
మాండ్ర శివానందరెడ్డి డీఎస్పీగా ఉంటూ 2014 ఎన్నికల సమయంలో వీఆర్‌ఎస్‌ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల వరకూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిగా కొనసాగారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరి, నందికొట్కూరు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. దీంతో బావబామ్మర్దులు అధికార, విపక్షపార్టీలో కొనసాగారు. అయితే పార్టీలు వేరైనా ఇద్దరూ సయోధ్యతో రాజకీయాలు నడిపారు. ఇదే గౌరు వెంకటరెడ్డికి మైనస్‌గా మారింది. 2017లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తనను అభ్యర్థిగా టీడీపీ ప్రకటిస్తోందని గౌరుతో మాండ్ర చెప్పారు. స్థానిక సంస్థలలో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ సభ్యులు ఉన్నారు. దీంతో ఆ పార్టీ గౌరు వెంకటరెడ్డిని బరిలోకి దించాలని భావించింది.

అయితే ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా బలంగా లేమని, టీడీపీ ప్రలోభాలతో ఫలితం వ్యతిరేకంగా ఉండే ప్రమాదముందని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బరిలో లేకుండా ఉండే ప్రయత్నం గౌరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మాండ్రను కాకుండా కేఈ ప్రభాకర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో తాను పోటీ చేస్తానని గౌరు ముందుకొచ్చారు. అప్పటికే ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్‌సీపీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో గౌరు రాజకీయ విలువలకు పాతరేసి బావకు సహకరించారని అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. ఇదే గౌరు రాజకీయ పతనానికి నాంది పలికింది. ఆపై వైఎస్సార్‌సీపీలో టిక్కెట్‌ దక్కకపోవడంతో మాండ్ర సూచనలతో టీడీపీలో చేరారు. పాణ్యం నుంచి గౌరు చరిత పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు నంద్యాల ఎంపీగా పోటీ చేసి మాండ్ర పరాజయం పొందారు.  

పరస్పరం మాటల యుద్ధం 
‘మీ మాటలు విని రాజకీయంగా నష్టపోయా. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి, ఇప్పుడు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ రోజు మీరు ఒత్తిడి చేయకపోయి ఉంటే నా రాజకీయ భవిష్యత్‌ మరోలా ఉండేది. మీరు నన్ను నాశనం చేశారు?’ అని గౌరు ఆగ్రహం వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. దీనికి మాండ్ర, అలాగే గౌరు సోదరి కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ‘రాజకీయంగా నీ ఎదుగుదల కోసం అన్ని విధాలా ఎంతో సాయం చేశాం. అవి మరిచి మాపైనే నిందలు మోపుతావా?’ అని గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది.

ఇరు కుటుంబాల వాదోపవాదనల నేపథ్యంలో మాండ్ర పూర్తిగా నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గానికి దూరమయ్యారు. హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు రాని పరిస్థితి. చివరకు నారా లోకేశ్‌ వచ్చినా గైర్హాజరయ్యారంటే పరిస్థితి ఏంటో తెలుస్తోంది. మాండ్ర విషయాన్ని టీడీపీ తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పోయిన విశ్వసనీయతను తెచ్చుకోవాలంటే మాండ్రకు దూరంగా రాజకీయాలు చేయాలని, తిరిగి ఆయన ప్రలోభాలలో ఉంటే మరింత నష్టపోతాననే యోచనలో గౌరు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా గౌరు, మాండ్ర వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. 

మరిన్ని వార్తలు