Munugode Politics: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆయనే!.. అన్ని పార్టీల కంటే ముందే

19 Aug, 2022 14:21 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బరిలో ఉంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. రేపు (శనివారం) జరగనున్న మునుగోడు సభలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం.. చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు కలుపుకొని 200 మందికి పైగా నాయకులు సమావేశమయ్యారు.

సీఎం కేసీఆర్‌తో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (ఫైల్‌ ఫొటో)

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఎలా ఇబ్బంది పెట్టారు.. ఆర్థికంగా ఎలా దెబ్బకొట్టారు.. అనే విషయాలను ఒక్కొక్కరుగా మాట్లాడారు. మంచి బట్టలు తొడిగినా ఓర్వలేదని, గ్రామాల్లో గ్రూపులు కట్టి విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అందరూ కలసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వవద్దని, ఇస్తే పనిచేయొద్దని, ఆయనకు తప్ప ఎవరికిచ్చినా సరే అని తీర్మానం చేసి సంతకాలు చేశారు.

ఈ తీర్మాన పత్రాన్ని పార్టీ అధిష్టానానికి అందజేయనున్నట్టు చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ పెద్దలు అసమ్మతి నాయకులను పిలిపించుకుని మాట్లాడి వారిని శాంతింపజేసినట్టు తెలిసింది. అందరినీ ఏకతాటిపైకి వచ్చేలా చేసిన తర్వాతే ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ఫైనల్‌ చేసినట్టుగా సమాచారం. 

చదవండి: (మునుగోడులో బరిలోకి రేవంత్‌.. కాంగ్రెస్‌ ప్లాన్‌ ఫలిస్తుందా..?)

మరిన్ని వార్తలు