చంద్రబాబు కారణంగా వ్యవస్థ భ్రష్టుపడుతుంది 

25 Jan, 2021 09:19 IST|Sakshi

ఆయన కారణంగానే నిమ్మగడ్డ అప్రతిష్ట పాలవుతున్నారు 

చంద్రబాబుకు ఆత్మవిమర్శ ఉండదు...

దేవుడ్ని సైతం రాజకీయాల్లోకి లాగడం దారుణం 

ఒంగోలు: చంద్రబాబు కారణంగానే వ్యవస్థ భ్రష్టుపడుతుందని , ప్రజల కోసం మనమా లేక మనకోసం ప్రజలా అనే పరిస్థితి నేడు నెలకొందని ఏపీ సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆదివారం ఒంగోలు ఎన్‌టీఆర్‌ కళాక్షేత్రంలో సాహిత్య కార్యక్రమానికి హాజరైన ఆమె కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఎన్‌టీఆర్‌ జీవించి ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎంతో మంచిగా ఉండే వారని, తనకు అతని గురించి బాగా తెలుసన్నారు. కానీ నేడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి చంద్రబాబు చేతిలో పావుగా మారడం బాధాకరమని, ఈ సమయంలో నిమ్మగడ్డ తెలివి తేటలు ఏమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో ఏళ్లపాటు సంపాదించుకున్న మంచి పేరు మొత్తం ప్రస్తుతం కోల్పోతున్నారని, ఇప్పటికైనా మంచి వ్యవస్థకు నాంది పలికేందుకు చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలని నిమ్మగడ్డకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితులు ఉండవని, ఆయన అనుకున్నదే నిజం చేయాలనుకుంటారన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అక్రమాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీచ రాజకీయాలు చంద్రబాబు నైజం అన్నారు. భారత దేశం లౌకిక రాజ్యం అని, సర్వమతాలు సమానమే అన్నారు. చంద్రబాబు నీచ, క్షుద్ర రాజకీయాలకు నిదర్శనంగా దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగారని , ఒక వైపు హిందువును అంటూనే మరో వైపు హిందూ విగ్రహాలను ధ్వంసం చేయమని ఎవరైనా చెబుతారా , అలా చెబితే వారు హిందూ ద్రోహి అవుతారు తప్ప హిందువు కారన్నారు. ఇటువంటి వ్యక్తులను బీజేపీ సైతం దూరంగా ఉంచడం మంచిదని ఆ పారీ్టకి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మరో వైపు జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ వ్యవహారాల గురించి రాసిన వారు చంద్రబాబు , భువనేశ్వరి పలుక్కోవడం లేదు, చంద్రబాబుకు భోజనం కూడా పెట్టడం లేదు అంటే దీనిని ఆయన నిరూపించుకుంటారా అని ప్రశ్నించారు. ఏ కుటుంబం గురించి అయినా విమర్శించడం సరికాదన్నారు.  

మరిన్ని వార్తలు