బాలకృష్ణ నిజాలు తెలుసుకోవాలి

21 Nov, 2021 04:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎన్టీఆర్‌ సతీమణి, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి అన్నారు. శనివారం ఆమె తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను మోసం చేసినట్టే ఆయన కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఎక్కడా భువనేశ్వరి ప్రస్తావన రాకపోయినప్పటికీ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకుని మసిపూసి మారేడు కాయ చేశారని మండిపడ్డారు. ఇవేవీ గుర్తించకుండా నేటికీ బాబు ట్రాప్‌లో పడి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు మోసపోతుండటం బాధాకరమని పేర్కొన్నారు.

చదవండి: (‘చంద్రబాబు సతీమణి గురించి సభలో ఎక్కడా ప్రస్తావన రాలేదు’)

ఈ నిజాల్ని బాలకృష్ణ గుర్తించాలన్నారు. వైశ్రాయ్‌ హోటల్‌ ముందు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి.. వెన్నుపోటు పొడవటం వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని అప్పట్లో వివరించినా బాలకృష్ణ స్పందించలేదన్నారు. అధికారం కోసం బాబు చేస్తున్న కుట్రలను ఇప్పటికైనా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు గుర్తించాలని కోరారు. నాడు ఎన్టీఆర్‌ కన్నీరు పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకు కనిపించలేదా అని నిలదీశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన చివరి రోజుల్లో క్షోభకు గురిచేసిన చంద్రబాబుకు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వడం సమంజసం కాదన్నారు. మహానీయుడి కుటుంబంలో పుట్టి ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ‘ఆస్కార్‌ అవార్డును దాటిపోయేలా నటిస్తున్నాడు.

చదవండి: (చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు: మంత్రి బాలినేని)
నన్ను మించిన నటుడు చంద్రబాబు’ అని ఎన్టీఆర్‌ అన్న మాటలను లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి పనైనా చేయగల సిద్ధహస్తుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. 25 ఏళ్లపాటు చంద్రబాబుపై పోరాడానని, ఎన్ని కష్టాలు పడ్డా ఎన్టీఆర్‌ సిద్ధాంతాన్ని తాను ఇప్పటికీ వదిలిపెట్టలేదని తెలిపారు. బాబుపై పోరాటం చేయడానికే వైఎస్సార్‌సీపీలో చేరానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రబాబుపై విమర్శలు చేస్తారే తప్ప ఏనాడైనా ఆడవాళ్ల జోలికి పోయారా అని ప్రశ్నించారు. వైఎస్‌ షర్మిలపై అనేక రకాలుగా కామెంట్స్‌ చేయించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. 

మరిన్ని వార్తలు