లాలూకి బెయిల్‌.. నితీష్‌కు ఫేర్‌వల్‌‌

24 Oct, 2020 11:50 IST|Sakshi

ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఆర్‌జేడీ

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. తొలి విడత పోలింగ్‌కి సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ రణరంగంలో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో పట్నా రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ని లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్ష నేత, ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నితీష్‌ హయాంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయిందని, పేదరికం తాండవిస్తోందని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించి ఓ భారీ బహిరంగ సభలో తేజస్వీ ప్రసంగించారు. (మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు)

లాలూకి బెయిల్‌
తన తం‍డ్రి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని, నవంబర్‌ 9న జైలు నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి బయటకు వచ్చిన వెంటనే నితీష్‌ పదవి నుంచి దిగిపోక తప్పదని జోస్యం చెప్పారు. సీఎంకు ఇక ఫేర్‌వల్‌ ఇచ్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పశుదాణా కుంభకోణంలో అరెస్ట్‌ అయిన లాలూ ప్రసాద్‌.. ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఓ కేసులో ఆయనకు బెయిల్‌ వచ్చినప్పటికీ.. మరో కేసులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులోనూ బెయిల్‌ మంజూరు కావడంతో విడుదలకు సిద్ధమయ్యారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీకి అక్టోబర్‌ 28న తొలి విడత పోలింగ్‌ జరగబోతుంది. నవంబర్‌ 3న రెండో, 7న చివరి విడత పోలింగ్‌.. 10న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

17 అంశాలతో మేనిఫెస్టో
ఇక తొలి విడత పోలింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో తేజస్వీ మరింత దూకుడు పెంచారు. ఎన్నికల్లో కీలకమైన మేనిఫెస్టోని విడుదల చేశారు. మొత్తం 17 అంశాలతో కూడని మేనిఫెస్టోని విడుదల చేశారు. యువత, నిరుద్యోగులను ఆకర్శించే విధంగా వారిని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పది లక్షల ఉద్యోగాల నియామకానికి చర్యలు చేపడతామన్నారు. మెరుగైన ఆరోగ్య భీమాతో పాటు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నితీష్‌ కుమార్‌ తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. మరోసారి ప్రజలు మోసం చేయడానికి బీజేపీ-జేడీయూ నేతలు ఉచిత హామీలను ఇస్తున్నారని మండిపడ్డారు.

కూటమికే మెజారిటీ
మరోవైపు ఇప్పటివరకూ వచ్చిన సర్వేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌కుమారే ఇప్పటికీ మెరుగైన సీఎంగా జనం భావిస్తున్నారని చెబుతున్నాయి. ఆయన ప్రభ కాస్త తగ్గినా, కేంద్రంలో నరేంద్ర మోదీ సమర్థపాలన దానికి జవజీవాలు కల్పించిం దని, పర్యవసానంగా ఆ రెండు పార్టీల కూటమి మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని అంటున్నాయి. నవంబర్‌ 10న వెలువడే ఫలితాల్లో బిహారీలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. కరోనా అనంతరం తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి ఎన్నికలు గనుక దేశ వ్యాప్తంగా వీటిపై సహజంగానే ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు