కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?'

2 May, 2021 18:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు నామరూపాల్లేకుండాపోయింది. ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. ఇక కేరళలో కమ్యూనిస్టులతో కలిసి యూడీఎఫ్‌గా ఉన్న కాంగ్రెస్‌ మరోసారి ఓటమిని చవిచూసింది. ఒక్క తమిళనాడులో తన మిత్రపక్షం డీఎంకే విజయం పొందడం కొంత సానుకూల పరిణామం. పుదుచ్చేరిలో చేదు ఫలితాలు పొందింది. ఈశాన్య రాష్ట్రం అసోంలో కూడా అదే ఫలితాలను చవిచూసింది.

దీంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత క్షీణించి ఒక ప్రాంతీయ పార్టీ కన్నా తక్కువ స్థాయిలో ఓట్ల శాతం పొందింది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. అత్యంత గడ్డు పరిస్థితులు ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కాంగ్రెస్‌ పార్టీకి ఎదురవుతోంది. స్వాతంత్ర్య భారతదేశాన్ని 60 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్‌ ఇప్పుడు గడ్డు రోజులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. మహారాష్ట్రలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళ మినహా ఎక్కడా కూడా కాంగ్రెస్‌ అధికారంలో లేదు. తెలుగు రాష్ట్రాల్లో హస్తం పార్టీ క్షీణ దశకు చేరుకుంది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో నామరూపాల్లేకుండా పోగా.. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మూడో పార్టీగా నిలిచింది. నాగార్జున సాగర్‌లో రెండో స్థానం పొందగా, తిరుపతిలో అసలు కనీసం ఆ పార్టీ ఉన్నట్టు కూడా జనాలకు తెలియదు. ఈ విధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేదు ఫలితాలను పొందుతోంది. ఇక హస్తం పార్టీ హస్త'గతమేనా..?' అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం.. పార్టీకి నాయకత్వ లోపం. పార్టీకి జవసత్వాలు కల్పించే నాయకుడు లేకపోవడం.. ఆ పార్టీకి ప్రధాన నెగటివ్‌.
చదవండి: ఈ విజయం కేసీఆర్‌కు అంకితం..నోముల భగత్‌
చదవండి: గెలుపు సంబరం.. పొంచి ఉన్న కరోనా విస్ఫోటనం

>
మరిన్ని వార్తలు