ప్రజా సంకల్ప యాత్ర చరిత్రాత్మకం

9 Jan, 2022 04:44 IST|Sakshi

నాటి పాదయాత్రలోనే సంక్షేమ పరిపాలనకు బీజం

వైఎస్‌ జగన్‌ 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్ర ఓ సంచలనం

నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు కార్యక్రమాలు

శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన ప్రజా సంకల్ప పాదయాత్ర కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. పాదయాత్ర పూర్తయ్యి నేటికి మూడేళ్లవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌ దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించారని చెప్పారు. పాదయాత్ర ఆద్యంతం ప్రజల గుండెల్ని హత్తుకుందన్నారు. పాదయాత్రలో  మూడు సంవత్సరాల క్యాలెండర్లు మారాయని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాల ద్వారా సంక్షేమ ఫలాలను ఇంటింటికీ అందిస్తున్నారని పేర్కొన్నారు. తండ్రి డాక్టర్‌ వైఎస్సార్‌లా పేదవాడి గుండెల్లో బతకాలన్న కసే వైఎస్‌ జగన్‌ను ముందుకు నడిపిస్తోందని తెలిపారు. ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు ఎలా ఉంటాడో,  వైఎస్‌ జగన్‌ను చూసి నేర్చుకుంటాయని చెప్పారు.  

ప్రతిదీ రాజకీయం చేయడం టీడీపీకి అలవాటే  
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని కొప్పరపాలెంలో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోలు పోసి, నిప్పంటించిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని అప్పిరెడ్డి కోరారు. మొన్న పల్నాడులో ఒక తాగుబోతు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు.. దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహం పట్ల జరిగిన దుశ్చర్యను ఎందుకు ఖండించలేక పోతున్నారని ప్రశ్నించారు. విగ్రహాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం టీడీపీకి మొదటి నుంచీ అలవాటేనని ఆయన «
ద్వజమెత్తారు.  

మరిన్ని వార్తలు