పెట్రోల్‌ వ్యాట్‌పై మోదీ వ్యాఖ్యలు.. ప్రతిపక్షాల కౌంటర్‌ అటాక్‌

27 Apr, 2022 21:15 IST|Sakshi

పెట్రోల్‌, డీజిల్‌ పన్నుల పేరుతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ దాడి చేసిన విషయం తెలిసిందే. పెట్రోల్‌ ధరల పెంపుపై మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దూమారం రేపుతున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ట్యాక్స్‌ తగ్గించాలంటూ కోరిన మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కౌంటర్‌ దాడికి దిగాయి. మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని, బీజేపీయేతర రాష్ట్రాల పట్ల సవతి తల్లిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకనేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి.

 దేశంలో పెరుగుతున్న చమురు ధరలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ.. రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని కోరారు. కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఇంధనంపై వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ను తగ్గించారని అన్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడినా ఆలోచించకుండా ప్రజలకు ప్రయోజనాలు అందిచడమే మొదటి ప్రాధాన్యతగా భావించాయని పేర్కొన్నారు. అదే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలు ఇంధనంపై పన్ను తగ్గించలేదని, ఇప్పుడు తగ్గించాలని మోదీ కోరారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం అత్యవసరమన్నారు. అలాగే సహకార సమాఖ్య విలువలను నెలబెట్టాలని రాష్ట్రాలను కోరారు.
చదవండి👉ముందు మీ రాష్ట్రాల్లో తగ్గించమనండి 

అయితే మోదీ వ్యాఖలపై ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు ఘాటుగా స్పందించాయి. మోదీ వ్యాఖ్యలను తిప్పికొడుతూ విమర్శలు గుప్పించాయి. అందులో..

తెలంగాణ
కేంద్ర ప్రభుత్వం వల్లే ఇంధన ధరలు పెరిగిపోయాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఆరోపించారు. ట్యాక్స్‌ను తగ్గించడం కాదు.. తాము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంధనపంఐ ట్యాక్స్‌ను పెంచలేదని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం విధించిన సెస్‌ వల్ల తమకు సరైన వాటాలో 41 శాతం రావడం లేదన్నారు. సెస్ రూపంలో కేంద్రం.. రాష్ట్రం నుంచి 11.4 శాతం దోచుకుంటుందని,  2023 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు 29.6 శాతం మాత్రమే లభిస్తోందన్నారు. దయచేసి సెస్‌ని రద్దు చేయాలని తద్వారా భారతదేశం అంతటా పెట్రోల్‌ను రూ.70కి మరియు డీజిల్‌ను రూ.60కి ఇవ్వగలమని అన్నారు. అప్పుడే ఒక దేశం - ఒకే ధర అవుతుందన్నారు.
చదవండి👉 గంగానదిని ప్రక్షాళన చేస్తామన్నారు.. కరోనా టైంలో శవాలు తేల్చారు: కేటీఆర్‌

పశ్చిమ బెంగాల్
కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఇతరులకు సవతి తల్లిగా వ్యవహరిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. పెట్రోల్‌ పన్నును తగ్గించాలంటూ  ప్రతిపక్ష రాష్ట్రాలకు ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిలో ‘రాజకీయ ఎజెండా’ ఉందని  విమర్శించారు.  ఇంకా, రాష్ట్ర ప్రభుత్వాలపై 'భారం' వేయవద్దని ఆమె కేంద్రాన్ని కోరారు. కేంద్రం ధరలు పెంచుతూ రాష్ట్రాలను పన్నులు తగ్గించాలని కోరడం ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించడమేనని అన్నారు. మోదీ ఇలా మాట్లాడకూతదని హితవు పలికారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మూడేళ్లుగా ఇంధనంపై రూ. 1 సబ్సిడీ ఇస్తోందని, ఫలితంగా రూ. 1,500 కోట్లు నష్టపోయిందన్నారు. అయితే దీనిని ప్రధాని మోదీ ప్రస్తావించలేదని ఆమె అన్నారు.

‘ఇంధన ఆదాయాన్ని 50-50 పంచుకోవాలని మేము చెప్పాం. ఇందుకు కేంద్రం అంగీకరించలేదు. వారు 75 శాతం తీసుకుంటూ ఇంధనంపై లక్షల కోట్లు సంపాదించారు. రాష్ట్రాలకు ఏం ఇవ్వలేదు.  కేంద్రం రూ. 97,000 కోట్లు బెంగాల్‌కు బకాయిపడింది. ఆ డబ్బు నాకు ఇవ్వండి. మేము సబ్సిడీలు ఇస్తాం. సామాన్యులకు మేం ఉపశమనం కలిగించకూడదనుకోవడం నిజం కాదు. కేంద్రమే మాపై భారీ భారం మోపుతోంది’  ”అని మమతా ఫైర్‌ అయ్యారు.

చదవండి👉ఇదేం పద్దతి, ప్రధాని మాట్లాడే మాటలేనా?.. కేసీఆర్‌ ఫైర్‌

తమిళనాడు
కేంద్ర ప్రభుత్వం విధించిన సెస్ కారణంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ విమర్శించారు.సెస్‌ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గుర్తుచేస్తూ.. దయచేసి సెస్ వసూలు చేయవద్దని ప్రధానమంత్రికి కౌంటర్ ప్రతిపాదన చేస్తామని తెలిపారు. సెస్‌ వసూలు చేస్తూ.. దానిని వ్యాట్‌గా మార్చవద్దని కోరారు.  అప్పుడైనా  కనీసం కేంద్రం తీసుకునే ధర అయినా రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతుందన్నారు.

డీఎంకే వ్యాట్‌ ధరలను ఎప్పుడూ పెంచలేదన్నారు. అంతేగాక పెట్రోల్ ధరలను రూ. 3 తగ్గించామని తెలిపారు.  వ్యాట్ ధరలను అన్నాడీఎంకే నిర్ణయించిందన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 26 లక్షల కోట్లు ఆర్జించిందని, ఆ సొమ్మంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.  ప్రధాని తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

మహారాష్ట్ర
ఇంధన ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం స్పష్టం చేశారు. ముంబైలో ప్రస్తుతమున్న లీటర్ డీజిల్ ధరలో కేంద్రానికి రూ.24.38, రాష్ట్రానికి రూ.22.37 వాటా ఉందన్నారు. అలాగే పెట్రోల్ ధరలో రూ. 31.58 కేంద్ర పన్ను.. రూ. 32.55 రాష్ట్ర పన్ను ఉందన్నారు. కావున రాష్ట్రాల కారణంగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెరుగుదల అనే మాటల్లో వాస్తవం లేదన్నారు. అంతేగాక రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వం ఇప్పటికే న్యాచురల్‌ గ్యాస్‌పై పన్ను మినహాయింపు ఇచ్చిందని చెప్పడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు