AIADMK Vs BJP: రెండాకుల ముసలం.. వేరుపడిన కమలం

1 Feb, 2022 09:00 IST|Sakshi

పంతం పట్టు వీడనంది.. బంధం బీటలు వారింది..ఫలితం రెండాకుల కూటమి నుంచి కమలం వేరుపడింది. పురిట్చితలైవి జయలలిత మరణానంతరం జోడీ కట్టిన అన్నాడీఎంకే, బీజేపీ నగరపాలక ఎన్నికల్లో తమదారులు వేరంటూ విడిపోయాయి. అయితే రాష్ట్రంలో వేరుపడినా.. కేంద్రంలో దోస్తీలమే అంటూ తమ కటీఫ్‌ కహానీకి కొత్తఅర్థం చెప్పాయి.

సాక్షి, చెన్నై(తమిళనాడు): అన్నాడీఎంకేతో అనుబంధాన్ని బీజేపీ తాత్కాలికంగా తెంచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆ పార్టీతో కటీఫ్‌ చెబుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సోమవారం అధికారికంగా ప్రకటించేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే జాతీయస్థాయిలో ఎన్‌డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ముగించారు.  

గత కొద్దిరోజులుగా.. 
తమిళనాడులో ఈనెల 19న నగర పాలక ఎన్నికలు జరగనున్నాయి. యథాప్రకారం డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఆ రెండు కూటములు తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై గత కొన్నిరోజుల్లో చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా అన్నాడీఎంకే–బీజేపీ సైతం సీట్ల పంపకంపై ఎడతెగని చర్చలు జరిపాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి అన్నాడీఎంకే–బీజేపీ మధ్య చాపకింది నీరులా పెరిగిపోతున్న అగాధం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బట్టబయలైంది. గతంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న డీఎండీకే, పీఎంకే వైదొలగడంతో తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ మాత్రమే పెద్ద పార్టీలుగా ఉన్నాయి.  

డీఎంకే కూటమిలో ఎడతెగని పంచాయితీ  
ఇదిలా ఉండగా, డీఎంకే కూటమిలో సైతం సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. అన్నాడీఎంకే కూటమిలో గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని డీఎంకే కూటమి భావిస్తూ జాబితా విడుదలలో జాప్యం చేస్తోంది. కాంగ్రెస్‌ తదితర మిత్రపక్షాలతో చర్చలు జరుపుతూనే అభ్యర్థల ఖరారులో ఆచితూచి అడుగులు వేస్తోంది. జిల్లా స్థాయిలో సిద్ధం చేసిన జాబితాను డీఎంకే కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు.

పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ ఈ జాబితాను పరిశీలించి మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా తమ కూటమి నుంచి బీజేపీ  దూరం జరగడంతో అన్నాడీఎంకే సోమవారం రెండో, మూడో జాబితాలను విడుదల చేసింది. కాగా సీట్ల సర్దుబాటుపై డీఎంకేతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం నియమించిన ఆ పార్టీ అగ్రనేత రమేష్‌ చెన్నితాల సోమవారం ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న డీఎండీకే 100మంది అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేసింది.   

చర్చలు విఫలం.. 
కాగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్‌ ఎడపాడి పళనిస్వామితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై గతనెల 29వ తేదీన సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమిళనాడులో బలమైన పార్టీగా ఎదిగినందున 30శాతం సీట్లను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు పట్టుబట్టగా అన్నాడీఎంకే ఐదు శాతం మాత్రమే ఇస్తామని చెప్పింది. బీజేపీ క్రమేణా 18 శాతానికి దిగిరాగా అన్నాడీఎంకే మాత్రం 8 శాతానికి మించి ఇచ్చేది లేదని తెలిపింది.

తుది ఆఫర్‌గా 11 శాతం అంటూ ద్వితీయశ్రేణి నేతలతో బీజేపీకి అన్నాడీఎంకే ఆదివారం కబురుపంపింది. అయితే 18 శాతం కంటే తగ్గేదిలేదని కమలనాథులు ఖరాఖండీగా బదులిచ్చారు. చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే అన్నాడీఎంకే తమ తొలి జాబితాను ఆదివారం విడుదల చేయడంతో కమలనాథులు ఖంగుతిన్నారు. బీజేపీతో మళ్లీ చర్చలకు తావులేకుండా ఎడపాడి పళనిస్వామి సేలంకు వెళ్లిపోయారు.

ఆ పార్టీ కార్యాలయం నుంచి కూడా బీజేపీకి సోమవారం ఎలాంటి పిలుపురాలేదు. తాజా పరిణామంపై అన్నామలై సోమవారం హడావిడిగా చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అగ్రనేతలతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నామలై మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరుకు దిగుతోందని ప్రకటించారు.

తాము కోరినన్ని స్థానాలు ఇచ్చేందుకు నిరాకరించిన అన్నాడీఎంకేతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలిపారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్‌డీఏ కూటమిలో 2024 పార్లమెంటు ఎన్నికల వరకు అన్నాడీఎంకే కొనసాగుతుందని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు