ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్‌ గవర్నరే!

23 Mar, 2021 10:00 IST|Sakshi

జీఎన్‌సీటీడీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

రాజ్యాంగ వ్యతిరేకమన్న కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ

న్యూఢిల్లీ:  ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే అని తేల్చిచెప్పే బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ద గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ సవరణ బిల్లు 2021(జీఎన్‌సీటీడీ)ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వం ఎవరనే అంశానికి సంబంధించి కొన్ని విషయాల్లో గందరగోళం నెలకొందని, దీన్ని తొలగించేందుకే ఈ బిల్లును తెచ్చామని చెప్పారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని లోక్‌సభలో ఆప్, కాంగ్రెస్‌ వ్యతిరేకించాయి.

బిల్లు ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఎల్‌జీ అని ఖరారుకానుంది, అంతేకాక ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్‌ చర్యకైనా ఎల్‌జీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి కానుంది. ఇది రాజకీయ బిల్లు కాదని, కేవలం కొన్ని అంశాలపై స్పష్టత కోసం తెచ్చిన బిల్లని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈబిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. నిజానికి ఈ బిల్లు 1991లో కాంగ్రెస్‌ తెచ్చిందని గుర్తు చేశారు. ఎల్‌జీ కార్యనిర్వహణాధికారి కనుక రోజూవారీ కార్యకలాపాలు తెలుసుకునే హక్కు ఆయనకుందన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి అధికారాలు లాక్కొని ఎల్‌జీకి కట్టబెట్టలేదని వివరించారు. తమ తప్పుంటే విని దిద్దుకుంటామని, కానీ ఎలాంటి తప్పు లేనప్పుడు విమర్శలను సహించమని, ఈ బిల్లు మరింత పారదర్శకత కోసమే తెచ్చామని చెప్పారు. 2015 నుంచి ఢిల్లీ హైకోర్టులో కొన్ని అంశాలపై వేసిన కేసులు, వాటిపై కోర్టు ఇచ్చిన రూలింగ్స్‌తో కొంత గందరగోళం నెలకొందన్నారు. ఎల్‌జీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపని చెప్పి చేయాలని కోర్టు తీర్పులిచ్చిందన్నారు.  

రాజ్యాంగ వ్యతిరేకం
రాష్ట్ర ప్రభుత్వ హక్కులను లాక్కునే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారి విమర్శించారు. ఇది గతంలో అప్పటి హోంమంత్రి అద్వానీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకమన్నారు. అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలను ప్రజా ప్రభుత్వం అమలు చేయకుండా అపేందుకే ఈ బిల్లు తెచ్చారన్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై గందరగోళానికి కాంగ్రెస్, ఆప్‌ కారణమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేకి దుయ్యబట్టారు. కావాలనుకుంటే కాంగ్రెస్‌ అప్పట్లోనే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందన్నారు.

2013లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఒక వ్యక్తి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ బ్రిజేందర్‌ సింగ్‌ పరోక్షంగా అరవింద్‌ క్రేజీవాల్‌ను విమర్శించారు. అరవింద్‌ హయాంలో ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చిఉంటే ఈ పాటికి సివిల్‌వార్‌ వచ్చేదన్నారు. రాష్ట్రాల హక్కుల హరణలో కేంద్రం స్పెషలిస్టని, ఢిల్లీని పాలించాలని భావిస్తోందని ఆప్‌ ఎంపీ భగవంత్‌మన్‌ విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లా అసెంబ్లీ ఉన్న యూటీలాగా ఢిల్లీని మార్చాలని కేంద్రం భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏ నిర్ణయాధికారం లేకుంటే, అసెంబ్లీకి ఎన్నికలెందుకన్నారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని ఎన్‌సీపీ డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు