Election Laws Amendment Bill 2021: ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానిస్తే ఈ మార్పులు తప్పనిసరి!

20 Dec, 2021 17:29 IST|Sakshi

Aadhaar - Voter ID Linking న్యూఢిల్లీ: ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు 2021కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఆధార్‌ను ఓటర్‌ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. నకిలీ ఓట్లను గుర్తించడమే లక్ష్యంగా ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానించడానికే ప్రతిపాదన బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రశంగ సమయంలో మంత్రి పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకించేవారంతా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. 

ఐతే కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఏఐఎమ్‌ఐఎమ్‌, ఆర్ఎ‌స్పీ, బీఎస్పీ పార్టీలు ఎన్నికల చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పరిశీలకు పంపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఏఐఎమ్‌ఐఎమ్‌ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లు ద్వారా స్వతంత్ర, రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్‌ కమిషన్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందనీ, ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానిస్తే భవిష్యత్తులో అనేక ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉందని వాదించారు. ఐతే అధికార బీజేపీకి పార్లమెంటు ఉభయసభల్లోనూ తగిన బలం ఉంది. అధికార ప్రతిపక్షాల వాదప్రతివాదనల మధ్య నేడు లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం బోగస్‌ ఓట్లను గుర్తించడమేకాకుండా, ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఒకే వ్యక్తి ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వం ప్రతిపాధించింది. మరోనిబంధన ఏంటంటే ప్రతీ ఏట నాలుగు తేదీల్లో మాత్రమే యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారు జనవరి 1వ తేదీలోపు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాగా విపక్ష నేతల ఆందోళనలతో సభ మంగళవారానికి వాయిదా పడింది. ఏదిఏమైనప్పటికీ ఎన్నికల సంస్కరణ బిల్లు దేశ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని రచించనుందని చెప్పవచ్చు. 

చదవండి: ‘నెలంతా కురవాల్సిన వర్షం నిన్న ఒక్కరోజే కురవడంతో 30 వేల మంది నిరాశ్రయులయ్యారు'

మరిన్ని వార్తలు