లోకేశ్‌ పర్యటన: రాజకీయ లబ్ధికే రభస

9 Sep, 2021 08:36 IST|Sakshi

నేడు నరసరావుపేటకు నారా లోకేశ్‌

హత్యకు గురైన విద్యార్థిని అనూష కుటుంబానికి ఏడు నెలల తర్వాత పరామర్శ

కోర్టు విచారణ ప్రారంభానికి ముందు ఆందోళనకు సిద్ధం కార్యక్రమానికి అనుమతి లేదు

రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ

సాక్షి, అమరావతి బ్యూరో: ఉన్మాదుల అఘాయిత్యాలను ఆసరాగా చేసుకుని విపక్ష టీడీపీ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇటీవల గుంటూరులో ఉన్మాది చేతిలో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించకుండా అడ్డుకున్న లోకేశ్‌ బృందం రచ్చను మరవకముందే మరోసారి అదే తరహాలో పర్యటనకు సిద్ధమయ్యారు. నరసరావుపేటలో ఏడు నెలల కిందట హత్యకు గురైన అనూష కుటుంబానికి పరామర్శ పేరుతో ఆయన మరో నాటకానికి తెరతీశారు. నారా లోకేశ్‌  గురువారం నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు ధర్నా పేరుతో  సిద్ధమయ్యారు.

అయితే కోర్టు విచారణ ప్రారంభమవుతున్న తరుణంలో లోకేశ్‌ బృందం రచ్చ చేసేందుకు ప్రయత్నించటాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనల సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలతోపాటు బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తోందని గుర్తు చేస్తున్నారు. మూడు గ్రూపులతో నరసరావుపేటలో సతమతమవుతున్న టీడీపీని రక్షించుకునేందుకే నారా లోకేశ్‌ పరామర్శ పేరుతో వస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. కోవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా భారీగా జన సమీకరణ చేపడుతున్న లోకేశ్‌ కార్యక్రమానికి అనుమతి లేదని రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ స్పష్టం చేశారు.

21 నుంచి కేసు విచారణ ప్రారంభం..
సత్తెనపల్లి నియోజకవర్గం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని కోట అనూష మరో యువకుడితో చనువుగా ఉండటాన్ని సహించలేక నిందితుడు మేడం విష్ణువర్ధనరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 24న రావిపాడు శివారులోని పొలాల్లో గొంతు పిసికి హతమార్చాడు. ఈ ఘటనలో పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల్లోనే ప్రాథమిక చార్జిషీట్, ఎనిమిది రోజుల్లో తుది చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ నెల 21 నుంచి కేసు విచారణ జరగనుంది. మృతురాలి కుటుంబ సభ్యులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు పరామర్శించి ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు పరిహారం అందజేశారు. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నరసరావుపేటలో ఇంటి స్థలం ఇవ్వాలని బాధిత కుటుంబం కోరడంతో ఆ మేరకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు కూడా పంపారు. 

ప్రభుత్వం, పోలీసులను అభినందించిన జాతీయ ఎస్సీ కమిషన్‌..
గుంటూరులో ఆగస్టు 15న విద్యార్థిని రమ్య హత్యకు గురికాగా గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడమే కాకుండా ఏడు రోజుల్లో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ పరంగా పరిహారాన్ని వేగంగా అందచేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును, పోలీసుల చర్యలను జాతీయ ఎస్సీ కమిషన్‌ సైతం ప్రశంసించింది. ఇలా తక్షణమే స్పందిస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షం బురద చల్లేందుకు ప్రయత్నించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి:
రాజకీయ లబ్ధి కోసమే లోకేశ్‌ పర్యటన  
నాసిరకం రోడ్లేసి నిందలా?

మరిన్ని వార్తలు