యువగళం ముసుగులో టీడీపీ గూండాల దాడి 

26 Aug, 2023 03:44 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపైన, ఇద్దరు విలేకరులపైనా దాడి 

పాదయాత్రలో సీఎంపై లోకేశ్‌ అనుచిత వ్యాఖ్యలు 

సీఎం జగన్‌ ప్రజల కోసమే పనిచేస్తున్నారన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త 

లోకేశ్‌ సైగతో అతనిపై మూకుమ్మడిగా దాడి చేసిన టీడీపీ గూండాలు 

జనం లేక సమావేశాలన్నీ రద్దు చేసుకున్న లోకేశ్‌  

నూజివీడు: లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముసుగులో టీడీపీ గూండాలు ఏలూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపైన, విలేకరులపైన దాడులకు పాల్పడ్డారు. శుక్రవారం నూజివీడు మండలం తుక్కులూరులో లోకేశ్‌ పాదయాత్ర చేశారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పాదయాత్రలో సైకో అంటూ ముఖ్యమంత్రి పట్ల అవమానకరంగా మాట్లాడటాన్ని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త యలమర్తి చిట్టిబాబు సహించలేకపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు పాలడుగు నాని ఇంటి ముందు ఉన్న  రేకుల షెడ్‌లో నుంచి వైఎస్సార్‌సీపీ జెండా ఊపుతూ మా ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నారంటూ పెద్దగా అన్నారు.

లోకేశ్‌ వెంటనే యువగళం టీంలో ఉన్న రౌడీమూకకు సైగ చేయడంతో దాదాపు 20 మంది ఒక్కసారిగా చిట్టిబాబు వద్దకు పరుగెత్తుకెళ్లి దాడి చేశారు. అక్కడే ఉన్న రూరల్‌ సీఐ ఆర్‌.అంకబాబు, ఎస్‌ఐ తలారి రామకృష్ణ వెంటనే చిట్టిబాబును పక్కకు లాగేసి, టీడీపీ గూండాలను వెళ్లగొట్టారు. సీఐ, ఎస్‌ఐ స్పందించకపోతే చిట్టిబాబు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది. పాలడుగు నాని పైనా టీడీపీ గూండాలు రాళ్లు విసిరారు.

టీడీపీ గూండాల దాడులను వీడియో తీస్తున్న హెచ్‌ఎం టీవీ రిపోర్టర్‌ అక్కినేని ప్రసాద్, ఆర్‌ టీవీ రిపోర్టర్‌ గోగినేని నానిలను కూడా టీడీపీ వారు పిడిగుద్దులు గుద్దుతూ వారి ఫోన్‌లు లాక్కోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. విలేకరులిద్దరూ ఎదురు దాడికి దిగడం, అంతలో పోలీసులు రావడంతో యువగళం రౌడీమూక వెళ్లిపోయింది. వైఎస్సార్‌సీపీ నాయకుడు పాలడుగు నాని ఇంటిపైనా రాళ్లు రువ్వారు. టీడీపీ గూండాల దాడిపై యలమర్తి చిట్టిబాబు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు చిట్టిబాబు ను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.  

ద్వారకా కాంప్లెక్స్‌ వద్ద కవ్వించిన టీడీపీ కార్యకర్తలు 
సాయంత్రం 5 గంటలకు తుక్కులూరు వద్ద లోకేశ్‌ పాదయాత్ర ద్వారకా సెంటర్‌ వద్దకు వచ్చింది. అదే సమయంలో ద్వారకా కాంప్లెక్స్‌ పైభాగాన స్థానికులు, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. లోకేశ్‌కు ముందు నడుస్తున్న టీడీపీ వారు కాంప్లెక్స్‌ వద్ద ఆగి, పైన ఉన్న వారిని రెచ్చగొట్టేలా చేతులు, కర్రలు ఊపుతూ ఖాళీ మంచి నీటి సీసాలను విసిరారు. 

జనం లేక అన్ని కార్యక్రమాలు రద్దు 
లోకేశ్‌ పాదయాత్రలో జనం లేకపోవడంతో ముందుగా ప్రకటించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.  గొల్లపల్లిలో గ్రామస్తులతో, మొర్సపూడిలో ముస్లిం మైనారిటీలతో, తుక్కులూరులో ఎస్సీ వర్గీయులతో భేటీలు ఉంటాయని ప్రకటించారు. అయితే, జనం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఈ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని మధ్యాహ్నం 12 గంటల కల్లా లోకేశ్‌ శిబిరంలోకి వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటల నుంచి పట్టణంలో నిర్వహించిన పాదయాత్ర కూడా వెలవెలబోయింది. 

మరిన్ని వార్తలు