అఫ్గాన్‌ నుంచి పాఠాలు నేర్చుకోండి

22 Aug, 2021 04:19 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వానికి మెహబూబా ముఫ్తీ హితవు

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించాలని డిమాండ్‌

శ్రీనగర్‌: అఫ్గానిస్తాన్‌ పరిణామాల నుంచి భారత ప్రభుత్వం ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ హితవు పలికారు. శనివారం కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పార్టీ కార్యకర్తల భేటీలో ఆమె మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని భాగస్వామ్య పక్షాలతో కేంద్రం చర్చలు జరపాలని, 2019లో రద్దు చేసిన ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని ప్రస్తావిస్తూ తమను పరీక్షించవద్దంటూ పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పొరుగు దేశంలో ఏం జరిగిందో చూడండి, పరిస్థితిని అర్థం చేసుకొని చక్కదిద్దండి అని సూచించారు. సూపర్‌ పవర్‌ అమెరికా తట్టాబుట్టా సర్దుకొని అఫ్గాన్‌ నుంచి తోక ముడిచిందన్నారు. కశ్మీర్‌లో చర్చల ప్రక్రియ ప్రారంభించడానికి భారత ప్రభుత్వానికి ఇప్పటికీ అవకాశం ఉందని చెప్పారు. ఆమె  వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ పట్ల మెహబూబాకు దురభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. 

>
మరిన్ని వార్తలు