కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలి.. అలా చేస్తే లాభమేంటో చెప్పిన కేజ్రీవాల్

26 Oct, 2022 11:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెలా కొత్తగా ప్రింట్ చేసే నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఈ దేవుళ్ల ఫోటోలు కూడా ఉండేలా చూడాలని సూచించారు. 

అయితే ఇలా ఎందుకు చేయాలో కూడా కేజ్రీవాల్ వివరించారు. లక్ష్మీదేవి ఫోటో కరెన్సీ నోటుపై ఉంటే దేశప్రజలకు ఆమె ఆశీర్వాదాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇది ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందటానికి దోహదపడుతుందని చెప్పారు. కష్టాలను దూరం చేసే దేవుడిగా పేరున్న వినాయకుడి ఫోటోతో ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. ఇండోనేసియా లాంటి దేశంలోనూ కరెన్సీపై వినాయకుడి ఫోటోను ముద్రిస్తున్నట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. అక్కడ 20వేల నోటుపై గణేషుడి ఫోటో ఉంటుంది.

ఢిల్లీలో వర్చువల్‌గా మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్.. రోజురోజుకు పతనమవుతున్న రూపాయి విలువ  గురించి మొదట ప్రస్తావించారు. ఆర్థికవ్యవస్థ బలంగా ఉండాలంటే స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మించాలని, మౌలికవసతులు మెరుగుపరచాలని సూచించారు.

ఒక్కోసారి ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా సత్ఫలితాలు రావని కేజ్రీవాల్ ‍అన్నారు. దేశంలోని వ్యాపారస్తులంతా రోజూ తమ పని మొదలు పెట్టేముందు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారని పేర్కొన్నారు. అందుకే ఆ దేవుళ్ల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రిస్తే సత్ఫలితాలు వస్తాయని, ఆర్థికవ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్రానికి గురువారం లేదా శుక్రవారం లేఖ రాస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
చదవండి: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖర్గే..

మరిన్ని వార్తలు