‘బీజేపీ మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది’

20 Nov, 2020 19:37 IST|Sakshi

పౌరుల వ్యక్తిగత స్వేచ్చను బీజేపీ హరిస్తుంది : రాజస్తాన్‌ సీఎం గహ్లోత్‌‌

తమ మతంలో కొనసాగే హక్కు స్రీలకు ఉంటుందన్న కేంద్ర మంత్రి  షెకావత్‌

జైపూర్‌: లవ్‌ జీహాద్‌ అనే పదాన్ని సృష్టించి భారతీయ జనతా పార్టీ మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌‌ ఆరోపించారు. దేశ ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తుందని బీజేపీపై మండిపడ్డారు. లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకొస్తామని బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. చట్టంలో ‘లవ్‌ జీహాద్‌’ కు ఎలాంటి నిర్వచనం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తమకు ఇష్టం ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం పౌరులకు రాజ్యాంగం కల్సించిన స్వేచ్ఛ అని.. అలాంటి స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తూ బీజేపీ రాజ్యాంగాన్ని ఉ‍ల్లంఘిస్తోందని మండిపడ్డారు. లవ్‌లో జీహాద్‌కు స్థానం లేదని, దీనిసై చట్టాలు తీసుకురావడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని గెహ్లట్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలాంటి చట్టాలు ఏ న్యాయస్థానంలోనూ నిలబడే పరిస్థితి లేదన్నారు. ప్రజలు తమ దయతోనే జీవించాలనే వాతావారణం సృష్టించేందుకు జీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.

ఆ స్వేచ్ఛ స్త్రీలకు ఉంటుంది : షెకావత్‌
అశోక్‌ గహ్లోత్‌‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. దేశంలో వేలాదిమంది యువతులు లవ్‌ జీహాద్‌ వలలో చిక్కుకుంటున్నారని షెకావత్‌ అన్నారు. ఎవరిని వివాహం చేసుకోవాలనేది వ్యక్తిగత స్వేచ్చ అయితే తమ మతంలో కొనసాగే హక్కు, స్వేచ్చ సైతం స్త్రీలకు ఉంటుందిని పేర్కొన్నారు. లవ్‌ జీహాద్‌ ట్రాప్‌లో పడుతున్న యువతులు పెళ్లి తర్వాత వారు నయవంచనకు గురైనట్లు గ్రహిస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో లవ్‌ జీహాద్‌ వంటి అనధికార నయా నయవంచన చట్టానికి కాంగ్రెస్‌ మద్దతిస్తుందంటూ దుయ్యబట్టారు.

కొత్త పదాలను సృష్టించడం, అల్లర్లకు పాల్పడటం, విద్వేషాలను రగిల్చడం వంటి వాటిపై కాంగ్రెస్‌ పార్టీ సర్వ హక్కులను కలిగి ఉంటుందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మహిళలకు అన్యాయం జరగకుండా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందనే విషయాన్ని బీజేపీ నమ్ముతుందని మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు.

గత కొంత కాలంగా లవ్‌ జీహాద్‌ అంశంపై దేశంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక వర్గం వారు ప్రేమ పేరుతో మత మార్సిడికి పాల్పడుతున్నారని, అలాంటి వారికి కాంగ్రెస్‌ పార్టీ వత్తాసు పలుకుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రజల వ్యక్తిగత స్వేచ్చను హరించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శిస్తుంది.

మరిన్ని వార్తలు