కర్ణాటక: తలనొప్పులు అప్పుడే మొదలయ్యాయి

15 Aug, 2021 02:29 IST|Sakshi

కర్ణాటక సీఎం బొమ్మై, యడియూరప్ప భేటీ

అసమ్మతిపైనే ప్రధానంగా చర్చించిన నేతలు

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ ఎస్‌.బొమ్మైకి అసంతృప్త మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులతో తలనొప్పులు అప్పుడే మొదలయ్యాయి. ఇటీవల ఏర్పాటైన కొత్త కేబినెట్, శాఖల కేటాయింపులపై అసమ్మతి గళాలు వినిపిస్తున్న నేపథ్యంలో శనివారం సీఎం బొమ్మై, తాజా మాజీ సీఎం యడియూరప్పతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరగంటపాటు యడియూరప్ప నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు నేతలు అసమ్మతి అంశంతోపాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు బొమ్మై సన్నిహిత వర్గాలు తెలిపాయి.

పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌ సింగ్, మునిసిపల్‌ పరిపాలన, చిన్నతరహా పరిశ్రమల శాఖల మంత్రి ఎన్‌.నాగరాజ్‌ తమకు కేటాయించిన శాఖలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాపనులు, రవాణా శాఖల వంటివి తనకు అప్పగించాలని నాగరాజ్‌ డిమాండ్‌ చేస్తుండగా అప్రాధాన్య శాఖను కేటాయించారంటూ అలిగిన ఆనంద్‌ సింగ్‌ బళ్లారి జిల్లా హోస్పేటలోని తన కార్యాలయాన్ని మూసివేశారు. మాజీ సీఎం యడియూరప్పతో, అనంతరం సీఎం బొమ్మైతో సమావేశమై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. అనంతరం సీఎం, రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ కలిసి ఆనంద్‌ సింగ్‌ను బుజ్జగించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ..తనకు సింగ్‌తో ఎలాంటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవనీ, పార్టీ నేతలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. ప్రాధాన్యం కలిగిన శాఖను ఆనంద్‌ సింగ్‌ డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని ఆయన అంగీకరించడం గమనార్హం. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్‌ఏ రామదాస్, ఎమ్మెల్సీ సీపీ యోగీశ్వర కూడా కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై అసహనంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో శనివారం వారు సీఎం బొమ్మైతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రికి సీల్డ్‌ కవర్‌లో ఒక లేఖను అందజేసినట్లు అనంతరం రామదాస్‌ మీడియాకు తెలిపారు. ‘తీరిక సమయంలో ఆ లేఖను చదవాలని సీఎం బొమ్మైను కోరాను. రాష్ట్రం, ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను అందులో వివరించాను’ అని ఆయన వెల్లడించారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్సీ యోగీశ్వర మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రితో రెండుసార్లు సమావేశ మయ్యాను. అయితే, వీటికి కారణాలంటూ ఏమీ లేవు. నాకెలాంటి అసంతృప్తి లేదు. నేను పార్టీ కార్యకర్తను. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తా’ అని తెలిపారు. జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా రెండు రోజుల అనంతరం బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు