రేవంత్‌రెడ్డికి మధుయాష్కీ బహిరంగ లేఖ

26 May, 2022 12:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌. ఈ మేరకు రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 

‘సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉద్యమ స్ఫూర్తిగా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల సాక్షిగా బానిస సంకెళ్లు తెంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. దేశంలో, రాష్ట్రంలో ఉన్న వనరుల్లో వారి త్యాగం, భాగస్వామ్యం ఉంది. నేడు ఆ వర్గాలన్నీ మేల్కొన్నాయి. సమాన అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. అణచివేతకు, అవమానాలను సహించమని చెబుతున్నాయి. సాధించుకున్న సగం తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ సాధించాలని ఆయా వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో.. అన్ని పార్టీలకు రెడ్ల మాత్రమే నాయత్వం వహిస్తే మనుగడ ఉంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి.  వ్యక్తిగతంగా మీకు .. పార్టీకి  ఈ వ్యాఖ్యలు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాలు తీవ్రంగా రగులుతున్నాయి. మీ వ్యాఖ్యలపై తిరుగుబాటు చేస్తామని ఆ వర్గాలు అంటున్నాయి. బహుజన వర్గాలన్ని మీ వ్యాఖ్యలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.. ఖండిస్తున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మేమెంతో.. మాకంతా అంటూ ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి’ అని లేఖలో ప్రస్తావించారు మధుయాష్కీ గౌడ్‌. 

‘కాంగ్రెస్ పార్టీ 2004-2009లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది సోనియాగాంధీ నాయకత్వం, రెడ్డి-బీసీల కలయిక అనే విషయన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇది అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2023 లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు కొత్తగా వచ్చిన మీకు (రెడ్డి సామాజిక వర్గానికి) పీసీసీ పదవి, సీఎల్పీ పదవి దళిత వర్గానికి, ప్రచార కమిటీ ఛైర్మన్ గా బీసీని, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీగా మరో దళితుడికి, కన్వీనర్లుగా ఇద్దరు మైనార్టీలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కొత్త కార్యవర్గాన్ని రూపొందించారు. అన్నికులాలను, వర్గాలను కలుపుకుపోవాలన్న లక్ష్యంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గారు ముందుకు వెళుతున్నారు’ అని అన్నారు. 

‘మీరు మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను సోనియాగాంధీ, రాహుల్ గాధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా అవమాన పర్చేలా కించపర్చేలా ఉంది. బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదు. పీసీసీ అధ్యక్షుడిగా మీకు పర్సనల్, ప్రవేట్, పబ్లిక్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడు మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచనతో కూడా ఉండాలి. మీరు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. దీనిని నివారించడానికి మీరు వెనువెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వడంతో పాటు, అధినాయకత్వానికి విధేయత ప్రకటించాలి. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ్డ ఆందోళనను, గందరగోళాన్ని నివృత్తి చేయాలని అడుగుతున్నా’ అని లేఖ ద్వారా ప్రశ్నించారు మధుయాష్కీ గౌడ్‌.

>
మరిన్ని వార్తలు