‘ఉద్యమ పార్టీ పేరుతో అడ్డంగా దోచుకున్నారు.. ఆ 900 కోట్లు ఎక్కడివి?’

4 Oct, 2022 17:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, గాంధీభవన్‌ మధు యాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ కాంక్షను  విస్తరించడానికి జాతీయ పార్టీ పెడుతున్నాడు. మొదట ఉద్యమ పార్టీ అని టీఆర్‌ఎస్‌ను స్థాపించి దోచుకున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు కొంటున్నాడు.. అంటేనే కేసీఆర్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర దోపిడీ అన్న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రంలో ఏం చేశాడు. 

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగితే బహుజనులకు, రైతులకు న్యాయం జరుగుతుందని ఆనాడు కేసీఆర్‌ అన్నాడు. కానీ, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌ చేసిందేమీ లేదు. కొత్త పార్టీ మొదలైతే టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్న కేసీఆర్‌.. తెలంగాణ జాతి ద్రోహి. కేసీఆర్‌.. తన కుమారుడు, కుమార్తె, అల్లుడి రాజ్య విస్తరణ కోసమే జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒకసారి ఆలోచించాలి. 8 సంవత్సరాలు పార్టీకి 900 కోట్లు ఎలా వచ్చాయి. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలి అన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు