ఎన్నికల్లో గెలుపు కోసం తాంత్రిక పూజలా?

21 Oct, 2023 06:37 IST|Sakshi

కమల్‌నాథ్‌ చర్యపై సీఎం చౌహాన్‌ వ్యాఖ్యలు

భోపాల్‌: కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ తన గెలుపుకోసం మంత్ర పూజలు చేయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ఉజ్జయినిలోని ఓ శ్మశానంలో ఓ తాంత్రికుడు కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రితో పూజలు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రి కావాలనే ఈ పూజలు జరిపిస్తున్నట్లు తాంత్రిక పూజారి భయ్యూ మహరాజ్‌ ‘ఇండియా టుడే’టీవీ ప్రతినిధికి చెప్పడం విశేషం. ఈ వ్యవహారంపై సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు.

‘ఎవరైనా భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వాలనుకుంటే, దానిని స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా నిర్వహించుకోవాలి. అదికాదని, ఇలా క్షుద్రపూజలు చేయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’అని పేర్కొన్నారు. ‘మేం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవలు చేయాలి. వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, వారికి సేవ చేయడానికి ఇదే మార్గం. కొందరు మాత్రం శ్మశానవాటికలో ‘తాంత్రిక క్రియ’లు నిర్వహిస్తున్నారు. వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగముందా?’అని చౌహాన్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు