నేనూ బీజేపీ ఎమ్మెల్యేనే.. కానీ ఇది కరెక్ట్‌ కాదు!.. సంచలన వ్యాఖ్యలపై పొలిటికల్‌ హీట్‌

14 Jul, 2022 15:33 IST|Sakshi

భోపాల్‌: బీజేపీకి ఊహించని పరిణామం ఒకటి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ యంత్రాగం మొత్తాన్ని పార్టీ స్వలాభం కోసం వాడుకోవడాన్ని సహించలేకపోతున్నానంటూ బహిరంగంగా వ్యాఖ్యానించాడు ఆయన.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో అధికా పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మైహర్‌(సత్నా) నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణన్‌ త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఈ ప్రాంతంలో ప్రచారం కోసం పర్యటిస్తున్నా. పట్వారీ నుంచి టాప్‌ ర్యాంక్‌ ఆఫీసర్‌ దాకా అంతా పార్టీ కోసమే పని చేస్తున్నారు. బీజేపీ ఓట్ల కోసమే తాపత్రయపడుతున్నారు. నేనూ బీజేపీ ఎమ్మెల్యేనే. కానీ, ఇలాంటి పరిస్థితి ఆవేదన కలిగిస్తోంది. ఈరోజుల్లో దేశంలో ఒక ప్రభుత్వాన్ని రెండు నిమిషాల్లో పడగొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరికి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాంటి రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఇలా జరగడానికి వీల్లేదు. పరిస్థితి మారాల్సిందే’’ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణన్‌ త్రిపాఠి వ్యాఖ్యానించారు. 


సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. ఎమ్మెల్యే నారాయణన్‌ త్రిపాఠి(కుడి)

ఇదిలా ఉంటే.. త్రిపాఠి వ్యాఖ్యలు మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ.. బీజేపీలో కనీసం ఒక్కరైనా ఇప్పుడు నిజం మాట్లాడే ధైర్యం చేశారు. అందుకు నారాయణన్‌కు కృతజ్ఞతలు.. అభినందనలు కూడా. వేల మంది అభ్యర్థుల ఆవేదనను మీరు బయటపెట్టారు. ప్రెసైడింగ్‌ అధికారులు.. బహిరంగంగానే ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు అంటూ దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. 

మైహర్‌ నియోజకవర్గం నుంచి 2003లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేశారు నారాయణన్‌ త్రిపాఠి. 2013లో కాంగ్రెస్‌ తరపున, 2016 ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా.. తిరిగి 2018లో బీజేపీ టికెట్‌ మీదే ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు 2019లో.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఈయన కూడా ఒకరు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో 2023 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు