తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌.. పళణిస్వామికి బిగ్‌ షాక్‌!

15 Sep, 2022 08:02 IST|Sakshi

సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి బుధవారం మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. రహదారుల టెండర్లలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణపై స్టే విధించేందుకు న్యాయ మూర్తులు నిరాకరించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన పళనిస్వామి పర్యవేక్షణలో రహదారుల శాఖ వ్యవహారాలు సాగిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో రహదారుల శాఖలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు అరప్పోర్‌ ఇయక్కం ఆరోపించింది. రూ. 4,800  కోట్లు రహదారుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేశాయి. 

అదే సమయంలో ఈ టెండర్ల వ్యవహారం పళనిస్వామి మెడకు చుట్టుకునే విధంగా కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది. అలాగే, మరోవైపు ఐటీ వర్గాలు సైతం దూకుడు పెంచాయి. పళణి స్వామి సన్నిహితులైన కాంట్రాక్టర్లను టార్గెట్‌ చేసి సోదాలు నిర్వహించాయి. అదే సమయంలో ఈ అక్రమాలపై దృష్టి పెట్టిన డీఎంకే ప్రభుత్వం తిరుచ్చి డివిజన్‌ రహదారుల శాఖ పర్యవేక్షణాధికారి, చీఫ్‌ ఇంజినీర్‌గా ఉన్న పళణిని సస్పెండ్‌ చేసింది. 

కోర్టులో విచారణ 
ఈ అక్రమాల వ్యవహారం విచారణ సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చింది. మద్రాసు హైకోర్టు ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ ముగించే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏసీబీ చర్యలకు సిద్ధం అవుతుండటంతో,  ఈ విచారణకు స్టే విధించాలని కోరుతూ పళణి స్వామి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ అక్రమాలపై ఏసీబీ ప్రాథమిక విచారణ ముగించినట్లు కోర్టుకు ఆ విభాగం తరపు న్యాయవాదులు వివరించారు. విజిలెన్స్‌ కమిషన్‌కు నివేదిక పంపించినట్లు, అనుమతి రాగానే, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం ఏసీబీ తదుపరి చర్యలకు స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారనను ఈనెల 26వ తేదీకి న్యాయమూర్తులు వాయిదా వేశారు.  
 

మరిన్ని వార్తలు