అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

2 Sep, 2022 13:55 IST|Sakshi

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఈకే పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వ వివాదంపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పార్టీకి పళనిస్వామే సుప్రీం నాయకుడని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లుతుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది.

జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ ఓ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. అప్పటి సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై పళనిస్వామి మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.

మరోవైపు కోర్టు తీర్పు అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఎర్పాటు చేశారు. గతంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆపీస్‌లో విధ్వంసం సృష్టించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.
చదవండి: కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ

మరిన్ని వార్తలు