‘మాది హిందుత్వ ప్రభుత్వం’.. అహ్మద్‌నగర్‌ కాదు.. ఇక అహల్యానగర్‌

1 Jun, 2023 07:34 IST|Sakshi

ముంబై: దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు నగరాలు, వీధులకు పేర్లను మారుస్తున్న పరిణామాలు చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలో షిండే శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా అలాంటి చర్యకే దిగింది. అహ్మద్‌నగర్‌ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మార్చేసింది. 

బుధవారం చౌండీలో జరిగిన అహల్యాదేవి జయంతోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే స్వయంగా ఈ  ప్రకటన చేశారు. 18వ శతాబ్దంలో ఇండోర్‌ స్టేట్‌ను పాలించిన వీరవనితే అహల్యాదేవి హోల్కర్‌. ఆమె జన్మస్థలంలోనే.. అదీ 298 జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం షిండే ఈ ప్రకటన చేయడం విశేషం. 

అహ్మద్‌నగర్‌, పూణేకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 15వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని అహ్మద్‌ నిజాం షా పాలించారు. ఆయన పేరు మీద ఈ ప్రాంతానికి అహ్మద్‌నగర్‌ పేరొచ్చిందని చెబుతుంటారు.

ఛత్రపతి శివాజీ, అహల్యాదేవి హోల్కర్‌ లాంటి వాళ్లను ఆరాధ్యులుగా భావించి మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  అహల్యాదేవి హోల్కర్‌కు సముచిత గౌరవం అందించాలనే ప్రజలందరి అభిష్టం మేరకు ఈ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మార్చాం అని షిండే ప్రకటించారు.

ఇక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ మాట్లాడుతూ.. ‘‘మా కూటమిది పక్కా  హిందుత్వ ప్రభుత్వమని, అహల్యాదేవి లాంటి వాళ్లు లేకపోతే కాశీ లాంటి సుప్రసిద్ధ క్షేత్రాలు ఉండేవే కావ’’ని చెప్పుకొచ్చారు. అంతకు ముందు షిండే ప్రభుత్వం ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఒస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన విషయాన్ని సైతం ఫడ్నవిస్‌ ప్రస్తావించారు. 

ఇదీ చదవండి: తన వేలితో తన కన్నే పొడుచుకున్న రాహుల్‌!

మరిన్ని వార్తలు