Mahabubabad: టీఆర్‌ఎస్‌ అధిష్టానం రహస్య సర్వే!

1 Sep, 2021 11:17 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడి వేటలో అధిష్టానం రహస్య సర్వే

అనుచరులకు పదవి దక్కేలా నేతల ప్రయత్నాలు

ఒకరికి వస్తే మరొకరితో తంటా!

సమన్వయంతో పనిచేసే వారికే పగ్గాలు

సాక్షి, మహబూబాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం రాష్ట్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. పార్టీలో మూడు వర్గాలు, నాలుగు గ్రూపులుగా ఉన్న నాయకులను ఒకే తాటిపై తెచ్చి అందరిని సమన్వయం చేసి పార్టీని ముందుకు నడిపించే నాయకుడి అవసరం అనివార్యమైంది. అయితే ప్రస్తుతం పార్టీలో వర్గాల వారీగా ఎవరికీ వారు తమ అనుచరుల పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం, వారిని పార్టీ అధినేత వద్దకు తీసుకెళ్లి పరిచయం చేయించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.

అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని నడిపించేందుకు అంగ, ఆర్థికబలం ఉన్న నాయకుడి కోసం పార్టీ అన్వేషిస్తుందని సమాచారం. కావునా నాయకులు చెప్పిన వారినే కాకుండా జిల్లాలోని మంచి నాయకుడి కోసం రాష్ట్ర పార్టీ రహస్యంగా సర్వే చేయించి నివేదిక తెప్పించే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇలా మరి కొద్దిరోజుల్లో భర్తీ కానున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడి పీఠం ఎవరికి దక్కుతుందో.. ఏ వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా నాయకుడు అవుతాడో అనేది చర్చగా మారింది. 

ఎవరికి వారుగా ప్రతిపాదనలు
టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడి పదవి తమ అనుచరులకు దక్కించుకునేందుకు జిల్లా నేతలు పోటీ పడుతున్నట్లు కన్పిస్తోంది. జిల్లా కేంద్రంలో ప్రభావితం చేసే నాయకుడు మహబూబాబాద్‌ నుంచి ఉంటే బాగుంటుందనే ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ తమ అనుచరుల పేర్లను ఇప్పటికే అధిష్టానానికి సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం.

ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌ రెడ్డి, మార్నేని వెంకన్న పేర్లు ఎమ్మెల్యే దృష్టిలో ఉన్నట్లు ప్రచారం. అయితే పాల్వాయి రాంమోహన్‌రెడ్డి ఇందుకు సుముఖంగా లేడనే వార్తలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా మానుకోట పార్లమెంట్‌ సభ్యురాలు మాలోత్‌ కవిత కూడా తమ అనుచరుడికి పీఠం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగానే మహబూబాబాద్‌ మండలానికి చెందిన కేఎస్‌ఎన్‌రెడ్డి, ముత్యం వెంకన్న పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం. కేఎస్‌ఎన్‌ రెడ్డిని పార్టీ వర్కింగింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారని తెలిసింది. అదేవిధంగా డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అనుచరులైన గుడిపూడి నవీన్‌రావు, రాంసహాయం రంగారెడ్డి పేర్లు కూడా జిల్లా అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు తెలిసింది. మంత్రి సత్యవతి రాథోడ్‌ కూడా తమ అనుచర వర్గంలోని నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం.

కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండి వెంకట్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, కొమ్మినేని రవీందర్‌ పేర్లు పరిశీలించి పార్టీ అధిష్టానానికి పంపాలనే ఆలోచనతో ఉన్నట్లు మంత్రి వర్గీయుల్లో చర్చ. ఇదిలా ఉండగా జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన బీరవెల్లి భరత్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి పేర్లు కూడా జిల్లా అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు మహబూబాబాద్‌ పట్టణం తర్వాత రెండో పెద్ద పట్టణమైన తొర్రూరు కూడా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఇందుకోసం తొర్రూరు ప్రాంతం నుంచి డాక్టర్‌ పోనుగోటి సోమేశ్వర్‌రావుకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నట్లు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు చెబుతున్నారు. 

సమన్వయంతో పనిచేసే వారికే..
టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నేతలు గ్రూపులుగా విడిపోవడంతో  పార్టీ అధ్యక్ష పదవి ముళ్ల కిరీటంలా మారింది. అందరిని ఏకతాటిపైకి తీసుకురావడమంటే కత్తిమీద సాములాంటిదే. ఈ క్రమంలో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీని నడిపించే సమర్థుడి కోసం అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. కాగా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జిల్లాపై పట్టు ఉండి అందరితో కలిసిపోయి క్యాడర్‌లో కొత్త జోష్‌ తీసుకొచ్చే నాయకుడు కావాలి.

ఇటీవల కాలంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దానిని కట్టడి చేస్తూ కొత్త క్యాడర్‌ను పార్టీలోకి తీసుకునేలా ఎత్తుగడలు వేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది పార్టీని నడిపించాలంటే ఆర్థిక పరిపుష్టి కూడా కీలకంగా పరిగణిస్తున్నారు. ఇన్ని లక్షణాలు ఉన్న నాయకుడి కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు వేచిచూస్తున్నారు. 

చదవండి: హుజూరాబాద్‌ ఉపఎన్నిక: కాంగ్రెస్‌ నుంచి ఈ పరిణామం ఉహించలేదు

మరిన్ని వార్తలు