KCR Mahabubnagar Tour: మోడీపై పరిమితంగానే విమర్శలు చేసిన కేసీఆర్‌.. ఆయన వ్యాఖ్యల్లో అంతరార్థం ఏంటో?

6 Dec, 2022 21:05 IST|Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో కొన్ని విశేషాలు గమనించవచ్చు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు కురిపించినా, పెద్ద గా హద్దులు దాటినట్లు అనిపించదు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని స్థాయి లో ఉన్నవారు అనవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ఉదాహరణ కాకుండా పశ్చిమబెంగాల్ ను ఉదహరించారు. బెంగాల్ లో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని గతంలో మోడీ చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. మోడీ ఆ మాట అన్న  విషయం నిజమే. అప్పట్లో దీనిపై కలకలం రేగింది. వివిధ రాజకీయ పక్షాలు మోడీ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించాయి. తాజాగా కెసిఆర్ ఆ సంగతి ఎందుకు తీసుకు వచ్చారో తెలియదు. 

అదే సమయంలో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించినవారని పట్టుకుని జైలులో వేశామని ఆయన తెలిపారు. నిజమే! ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా తప్పే. మధ్య ప్రదేశ్, కర్నాటక మొదలైన రాష్ట్రాలలో బిజెపి వారు గేమ్ ప్లాన్ ఆడి తమ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. కెసిఆర్ ఆ ముచ్చట చెప్పి  బిజెపిపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను కొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అలా ప్రయత్నం చేసినవారిని జైలులో పెట్టామని ఆయన వ్యాఖ్యానించారు.

విశేషం ఏమిటంటే ఆయనే గత ఎనిమిదేళ్లలో ముప్పైఏడు మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. మరి దానిని ఏమంటారన్నదానిపై మాట్లాడడం లేదు. కాకపోతే వారంతా తెలంగాణ అభివృద్ది కోసం స్వచ్చందంగా చేరారని చెప్పవచ్చు. ఎర కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చినవారు కావడం, అసలు పట్టుబడ్డ నిందితులతో ఈ ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధాలు ఏమిటో ఇంతవరకు బహిరంగ పరచకపోవడం కూడా ఆసక్తి కలిగిస్తుంది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టగలదా? ఈ నేపధ్యంలో  ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలను కొనడం ఏమిటో, సిట్ ఏమి తేల్చిందో, నిజంగానే బిజెపి ఎమ్మెల్యేలను కొనే యత్నం చేసిందో ఇంతవరకు తేలలేదు. 

కాని ఈ విషయంలో బిజెపిని ఇరుకున పెట్టడంలో, తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రచారం చేయడంలో కెసిఆర్ కొంతవరకు సఫలం అయ్యారు. ఇదే తరుణంలో తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపైన, మంత్రి మల్లారెడ్డి వంటివారిపైన వచ్చిన ఆరోపణలు టిఆర్ఎస్ కు అప్రతిష్టగానే మారాయి. ఎంత కేంద్రంపైన, కేంద్ర దర్యాప్తు సంస్థలపైన విమర్శలు కురిపించినా, చివరికి అవి నిర్వహించే విచారణలకు హాజరుకాకుండా ఉండలేని పరిస్థితి. టిఆర్ఎస్ నేతలను  కేంద్రం టార్గెట్ చేస్తోందని కెసిఆర్ వాపోయినా, సంబంధిత నేతలు తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంటుంది. 

డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ప్రముఖంగా వచ్చిన వైనంపై మహబూబ్ నగర్ సభలో మాట్లాడలేదు. అలాగే మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్ల లో జరిగిన సోదాలు, పట్టుబడిన డబ్బు గురించి ప్రస్తావించలేదు. దీనిని ఏమని అనుకోవాలి. ఈ పాయింట్ నే బిజెపి కాని, ఇతర పార్టీల నేతలు కాని ఫోకస్ చేస్తున్నాయి. మల్లారెడ్డి తన పై ఐటి దాడి జరిగినప్పుడు గంభీరంగా మాట్లాడారు కాని, ఆయన సంతృప్తికరమైన వివరణ ఇచ్చినట్లు కనిపించలేదు. 

అలాగే కవిత కూడా కావాలంటే జైలులో పెట్టుకోవాలని సవాల్ చేశారు కాని, ఆ స్కామ్ గొడవకు సంబంధించి స్పష్టత ఇచ్చినట్లు అనిపించలేదు. ఈ క్రమంలో ఆమె విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసు ఇచ్చింది.  ఎఫ్‌ఐఆర్‌ కాపీ, తదితర డాక్యుమెంట్లు అందచేయాలని , ఆ తర్వాత విచారణ చేయాలని ఆమె కోరారు. ఇందుకు సీబీఐ స్పందన ఎలా ఉంటుందన్నది తెలియవలసి ఉంది. అయితే, ఆమెను కేవలం వాంగ్మూలం ఇవ్వడానికే నోటీసు ఇవ్వడం కొంతలో కొంత ఊరట అవుతుందేమో! 

ఆమె సాక్ష్యం తర్వాత అధికారులు ఎలా స్పందిస్తారన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నిటి గురించి మాట్లాడడం ఒకరకంగా కెసిఆర్ కు కూడా ఎంబరాస్‌మెంటే అని చెప్పాలి. డిల్లీ  లిక్కర్ స్కామ్ జరగలేదని, మల్లారెడ్డి కాలేజీలలో అవకతవకలు లేవని చెప్పే సాహసం కెసిఆర్ చేయలేకపోవచ్చు. కాకపోతే టిఆర్ఎస్ వారిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి  ప్రభావితం చేస్తోందన్న అభియోగం మోపవచ్చు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఉదాహరణకు మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి పట్టుబడ్డ 15 కోట్ల నగదుపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోతే రాజకీయంగా కూడా కొంత నష్టం వాటిల్లవచ్చు.

ఏది ఏమైనా వచ్చే ఆరు నెలలు టిఆర్ఎస్ కు అత్యంత కీలకం. బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో టిఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల గడువు దగ్గరపడే కొద్ది ఈ కాక ఇంకా పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది.
- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు