రౌత్‌- ఫడ్నవిస్‌ భేటీ: మాట మార్చిన బీజేపీ!

29 Sep, 2020 14:12 IST|Sakshi

బీజేపీ నాయకుడు చంద్రకాంత్‌ పాటిల్‌ కీలక వ్యాఖ్యలు

తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాషాయ పార్టీ ప్రయత్నాలు!

ముంబై: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర ​మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ భేటీ వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవన్న బీజేపీ స్వరం మార్చింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సమావేశమైనపుడు కచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడతారని, ఇప్పుడు కూడా అదే జరిగిందని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలని ఎవరూ కోరుకోరు. కానీ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించగలవా? అస్థిరత నెలకొన్న సమయంలో ఎన్నికలకు మించి వేరేమార్గం ఉండదు కదా. ఒకానొక రోజు పరిస్థితి మారిపోతుంది. నిజానికి ఇద్దరు బడా నాయకులు కలిసినపుడు రాజకీయాల గురించే చర్చిస్తారు. చాయ్‌, బిస్కెట్ల గురించి కాదు. అయితే ఆ భేటీకి సరైన ముగింపు లభించలేదు’’ అంటూ శనివారం ఫడ్నవిస్‌- రౌత్‌ భేటీ గురించి వ్యాఖ్యానించారు. (చదవండి: సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు; సీఎం ఠాక్రేతో పవార్‌ భేటీ!)

కాగా సంజయ్‌ రౌత్‌, ఫడ్నవిస్‌ శనివారం హోటల్‌లో శనివారం  రహస్యంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ విషయం బయటకు పొక్కడంతో కేవలం సామ్నా పత్రిక కథనం కోసం సంజయ్‌ రౌత్‌, ఫడ్నవిస్‌ను ఇంటర్వ్యూ చేయాలని భావించారని, అందుకే ఆయనను కలిశారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ రౌత్‌.. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్‌ మా శత్రువేమీ కాదు. గతంలో ఆయనతో కలిసి పనిచేశాం. సామ్నా ఇంటర్వ్యూ కోసమే ఆయనను కలిశాను’’అని చెప్పుకొచ్చారు. అయితే ఈ భేటీ జరిగిన మరుసటి రోజే శివసేన సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ అయ్యారు. (శివసేనకు సీఎం, పవార్‌కు పెద్దపోస్టు : బీజేపీ ఆఫర్‌!)

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రమంత్రి సోమవారం ముంబైకి చేరుకున్న రాందాస్ అథవాలే.. పాతమిత్రపక్షం శివసేనను తిరిగి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక రానున్న ఏడాదికాలం పాటు ముఖ్యమంత్రి పీఠం సేరకు అప్పగించడమే గాకుండా, కేంద్ర ప్రభుత్వంలోనూ పదవులు కట్టబెడతామని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అథవాలే ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత పాటిల్‌ ఈ మేరకు స్పందించడం గమనార్హం. దీంతో పాత స్నేహితుడితో జట్టుకట్టి మహారాష్ట్రలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్న వార్తలకు బలం చేకూరుతోంది. వ్యవసాయ బిల్లుల నిరసన నేపథ్యంలో అకాళీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడం‌, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ దూరం కావడం తదితర అంశాల నేపథ్యంలో సుదీర్ఘకాలంగా మిత్రపక్షంగా కొనసాగిన శివసేనను దగ్గరచేసుకుని కూటమిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు