మహారాష్ట్ర కేబినెట్‌: ఆడబిడ్డను బలిగొన్నోడికి మంత్రి పదవా? బీజేపీ ఉపాధ్యక్షురాలి ఆగ్రహం

9 Aug, 2022 15:38 IST|Sakshi

ముంబై: చాలరోజుల సస్పెన్స్‌ తర్వాత ఏక్‌నాథ్‌ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్‌ల మంత్రివర్గం మహారాష్ట్రలో కొలువు దీరింది. అయితే ఈ కేబినెట్‌ ప్రమాణ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్త కేబినెట్‌లోని సేన రెబల్‌ ఎమ్మెల్యే ఒకరి వల్ల బీజేపీ శ్రేణుల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తితో పాటు ఆగ్రహామూ వ్యక్తం అవుతోంది.

సంజయ్‌ రాథోడ్‌.. యావత్మల్‌ జిల్లా దిగ్రాస్‌ నిజయోకవర్గపు ఎమ్మెల్యే. షిండే క్యాంప్‌లోని ఓ కీలక ఎమ్మెల్యే. ఇవాళ మంత్రిగా ప్రమాణం చేశాడు. అయితే ఆయన గతంలోనూ మంత్రిగా పని చేసి.. పదవి ఊడగొట్టుకున్నాడు. సంజయ్‌ రాథోడ్‌.. ఇంతకు ముందు ఉద్దవ్‌ థాక్రే కేబినెట్‌లో అటవీ శాఖ మంత్రి.  ఓ మహిళతో సంబంధం నడిపి.. ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పాడనే ఆరోపణలు బలంగా వచ్చాయి.   పైగా అతనికి శిక్షపడాలని గట్టిగా పోరాటం చేసింది బీజేపీనే. ఈ క్రమంలో.. ఆనాడు ఉద్దవ్‌ థాక్రే, సంజయ్‌తో బలవంతంగా రాజీనామా చేయించాడు. కట్‌ చేస్తే..

ఇవాళ మంత్రివర్గ ప్రమాణంలో అతనూ పాల్గొన్నాడు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర కిషోర్‌ వాగ్‌ తీవ్రంగా స్పందించారు.  బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్ర స్పందిస్తూ.. సంజయ్‌ రాథోడ్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కడం దురదృష్టకరం. ఓ మహారాష్ట్ర బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు అతను. అతనికి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుందని అని ఆమె ప్రకటించారు. 

టిక్‌టాక్‌ స్టార్‌ పూజా చవాన్‌తో సంజయ్‌ రాథోడ్‌ రిలేషన్‌షిప్‌ నడిపించాడు. అయితే వాళ్ల సంబంధం బెడిసి కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సైతం వైరల్‌ అయ్యాయి. ఈ కేసులో ఆమెకు అరెస్ట్‌చేయాలంటూ బీజేపీ నిరసనగళం గట్టిగా వినిపించింది. అందులో ఇవాళ రాథోడ్‌తో ప్రమాణం చేసిన కిరీట్‌ సోమయ్య సైతం ఉండడం కొసమెరుపు. ఇదిలా ఉంటే.. గతంలో సంజయ్‌ రాథోడ్‌ను గద్దె దించే పోరాటంలో ముందున్న దేవేంద్ర ఫడ్నవిస్‌.. సమక్షంలోనే సంజయ్‌ రాథోడ్‌ మంత్రిగా ప్రమాణం చేయడం మరో హైలైట్‌. 

మరోవైపు షిండే సైతం రాథోడ్‌ను గత కొంతకాలంగా వెనకేసుకొస్తున్నాడు. పోలీసులు ఆయనకు క్లీన్‌ చిట్‌ఇచ్చారనే విషయాన్ని పదేపదే మీడియా ముందు గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి బెర్త్‌ దక్కుతుందన్న ఊహాగానాలే నిజం అయ్యాయి. పూజా చవాన్‌ కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్‌ బృందం.. కిందటి ఏడాది అగష్టులో ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. కానీ, బీజేపీ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతూ వస్తూనే ఉంది.

ఇదీ చదవండి: కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు?

మరిన్ని వార్తలు