మీ పాఠాలు మాకు అనవసరం

14 Oct, 2020 04:29 IST|Sakshi

గవర్నర్‌పై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శ

ప్రార్థన స్థలాలను తెరవాలని గవర్నర్‌ లేఖ

అకస్మాత్తుగా లౌకికవాదివి అయ్యావా? అని ప్రశ్న

తెరిస్తేనే హిందుత్వ వాదులా? అని సీఎం ఎదురు ప్రశ్న

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, గవర్నర్‌ బి.ఎస్‌.కోషియారీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రార్థన స్థలాల పునః ప్రారంభంపై ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ‘మీరు అకస్మాత్తుగా లౌకికవాదిగా మారిపోయారా?’అని కోషియారీ సోమవారం రాసిన లేఖలో వ్యాఖ్యానిస్తే.. హిందుత్వంపై మీ సర్టిఫికెట్‌ తనకేమీ అవసరం లేదని ఉద్ధవ్‌ సమాధాన మిచ్చారు. మహారాష్ట్రలో ప్రార్థన స్థలాలను మళ్లీ తెరవాలని మూడు బృందాలను తనకు లేఖల రూపంలో విజ్ఞప్తి చేశాయని గవర్నర్‌  తన లేఖలో ప్రస్తావించగా.. ఆ మూడు బృందాలూ కాకతాళీయంగా బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులేనని ఉద్ధవ్‌ వ్యంగ్యవ్యాఖ్య చేశారు. కోవిడ్‌ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రార్థన స్థలాలను మళ్లీ తెరవడంపై ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

గవర్నర్‌ కోషియారీ సోమవారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ‘‘లౌకికవాదం అన్న పదాన్నే వ్యతిరేకించిన మీరు అకస్మాత్తుగా మారిపోయారా’’అని రాయగా.. ఉద్ధవ్‌ దానికి బదులిస్తూ.. ప్రార్థన స్థలాలను తెరిచినంత మాత్రాన హిందుత్వ వాదుల వుతారా? తెరవకుంటే లౌకికవాదులవుతారా? అని ప్రశ్నించారు. తాను ఆచరించే హిందుత్వకు గవర్నర్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదని అన్నారు. ప్రజల ఉద్వేగాలు, నమ్మకా లను పరిగణనలోకి తీసుకుంటూనే వారి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం కూడా ఉందని, లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సరికాదని ఉద్ధవ్‌ పేర్కొన్నారు. గుడులను తెరవాలన్న డిమాండ్‌తో బీజేపీ మంగళవారం ఆందోళనకు దిగింది. కోవిడ్‌ సమస్య ఉందని తెలిసినా బార్లు తెరిచిన ప్రభుత్వం గుడులకు ఎందుకు అభ్యంతరం చెబుతోందని వారు ప్రశ్నించారు. 

శివసేన హిందుత్వం బలమైంది: రౌత్‌
శివసేన హిందుత్వ విధానం గట్టి పునాదులపై నిర్మించిందని వారికి ఇతరుల పాఠాలేవీ అవసరం లేదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. కోవిడ్‌ ముప్పు ఇంకా ఉందన్న ప్రధాని∙వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ప్రజల బాధ్యత సీఎం ఠాక్రేదని అన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి సమర్థ చర్యలు తీసుకోవడాన్ని గవర్నర్‌ ప్రశంసించాల్సిందని అన్నారు.

అది మితిమీరిన భాష: పవార్‌
సీఎం ఠాక్రేకు రాసిన లేఖలో గవర్నర్‌ కోషియారీ వాడిన భాష అతిగా ఉందని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘అన్ని మతాలను సమ దృష్టితో చూడాలని రాజ్యాంగ పీఠిక చెబుతోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అందుకు తగ్గట్లుగా నడుచు కోవాల్సి ఉంటుంది. కానీ, గౌరవ గవర్నర్‌ ఆ లేఖను ఓ రాజకీయ పార్టీ నేతనుద్దేశించి రాసినట్లుగా ఉందే తప్ప.. ముఖ్యమంత్రికి రాసినట్లుగా లేకపోవడం దురదృష్టకరం’ అని పవార్‌ పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు