మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ షాక్.. సీఎల్‌పీ నేత థోరట్ రాజీనామా

7 Feb, 2023 15:11 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గపోరు తారస్థాయికి చేరింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే తీరును నిరసిస్తూ సీఎల్‌పీ నేత బాలా సాహెబ్  థోరట్ తన పదవికి రాజీనామా  చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ పంపారు.

నానా పటోలే తనను అవమానాలకు గురి చేస్తున్నారని, తాను బీజేపీలో చేరుబోతున్నాని తప్పుడు ప్రచారం చేస్తున్నారని థోరట్ ఆరోపించారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీ సమావేశాలకు ముందు తనను సంప్రదించడం లేదని తెలిపారు.

మహారాష్ట్రలో ఎంఎల్‌సీ ఎన్నికల సందర్భంగా నానా పటోలే, థోరట్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. థోరట్ బంధువు సత్యజీత్‌ తాంబేకు టికెట్ కేటాయించకుండా అతని తండ్రి సుధీర్ తాంబేకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో సత్యజీత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు తన కొడుకు పోటీలో ఉండటంతో చివరి నిమిషంలో సుధీర్ తాంబే నామినేషన్‌ సమర్పించలేదు. దీంతో తండ్రీకొడుకులను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే వీరిద్దరికీ థోరట్ మద్దతుగా నిలిచారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

నానా పటోలే ఇతర కాంగ్రెస్ నేతలు కలిసి థోరట్‌ను లక్ష‍్యంగా చేసుకున్నారని సత్యజీత్ తాంబే ఆరోపించారు. వారంతా పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పారు.
చదవండి: అదానీ వ్యవహారం: బెట్టు వీడని విపక్షాలు.. ప్రధాని స్పందనకై డిమాండ్‌

మరిన్ని వార్తలు