Maha Floor Test: సీఎం షిండే కన్నీరు.. ఆనాడే సీఎం కావాల్సింది, కానీ.. పదవిపై వ్యామోహం లేదని వ్యాఖ్య

4 Jul, 2022 17:57 IST|Sakshi

బీజేపీ మద్దతుతో బలపరీక్షలో అలవోకగా నెగ్గిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచిన అనంతరం..  చనిపోయిన తన ఇద్దరు కొడుకులను తల్చుకుని సభలోనే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారాయన. 

బలనిరూపణలో భాగంగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించే అర్హతను సంపాదించుకున్నారు ఏక్‌నాథ్‌ షిండే. పరీక్షలో 99 వ్యతిరేక ఓట్లు పోలైన సంగతి తెలిసిందే. అయితే విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మహా వికాస్‌ అగాఢి కూటమిలోనూ సీఎంగా తన పేరే ముందుగా తెరపైకి వచ్చిందని, కానీ, ఎన్సీపీ నేత ఒకరు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని షిండే వ్యాఖ్యలు చేశారు. సోమవారం బలనిరూపణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. అజిత్‌ దాదా(అజిత్‌ పవార్‌ను ఉద్దేశించి)నో ఇంకెవరో నన్ను ముఖ్యమంత్రిని చేయకుండా అడ్డుకున్నారు. ఆ టైంలో నాకేం ఇబ్బంది లేదని, ఉద్దవ్‌తోనే ముందుకు వెళ్లాలని తాను చెప్పానని, అప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నానని, సీఎం పదవి మీద తనకు ఎలాంటి వ్యామోహం షిండే వ్యాఖ్యానించారు. 

మేం శివ సైనికులం.. బాలాసాహెబ్‌(బాల్‌ థాక్రే), ఆనంద్‌ దిఘే సైనికులం మేమంతా. ఆరేళ్ల పాటు బాలాసాహెబ్‌ను ఓటు వేయకుండా నిషేధించారో మీకు గుర్తు చేయాలనుకుంటున్నా(కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ..1995-2001 మధ్య) అని షిండే వ్యాఖ్యానించారు. శివ సేనను రక్షించేందుకే తాను తిరుగుబాటు బావుటా ఎగరేశారనని చెప్పారు. బాలాసాహెచ్‌ ఆశయాలను బీజేపీ మాత్రమే నెరవేర్చగలదని వ్యాఖ్యానించారాయన.

థానే కార్పొరేటర్‌గా పని చేస్తున్నప్పుడు నా ఇద్దరు కొడుకులను కోల్పోయా. అంతా అయిపోయిందనుకున్నా. రాజకీయాలు వదిలేయాలనుకున్నా. ఆనంద్‌ దిఘే సాహెబ్‌.. నన్ను రాజకీయాల్లో కొనసాగాలని కోరారు అంటూ సీఎం షిండే గుర్తు చేసుకుంటూ గద్గద స్వరంతో ప్రసంగించారు.

మరిన్ని వార్తలు