Maharashtra: ఉద్ధవ్‌ ఠాక్రేకు దెబ్బమీద దెబ్బ.. శివసేనకు కదం ‘రాంరాం’

19 Jul, 2022 15:43 IST|Sakshi

సాక్షి, ముంబై: ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. పార్టీలో కీలక, సీనియర్‌ నాయకులందరూ దశలవారీగా పార్టీ నుంచి బయటపడుతుండటంతో శివసేన రోజురోజుకూ బలహీనపడుతోంది. ఇప్పటికే గట్‌ నాయకులు, శాఖ ప్రముఖులు, విభాగ ప్రముఖులు, మాజీ, సిట్టింగ్‌ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఇలా అనేకమంది ఉద్ధవ్‌ను వదిలేసి శిండే వర్గంలో చేరారు. తాజాగా శివసేన పార్టీలో సీనియర్‌ నేతగా, కట్టర్‌ శివసైనికుడిగా పేరుగాంచిన రాందాస్‌ కదం కూడా సోమవారం పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ పంపించారు. దీంతో ఉద్ధవ్‌కు చెందిన శివసేన పార్టీలో మరింత గందరగోళ పరిస్ధితి నెలకొంది.

శిందే తిరుగుబాటు తరువాత ఉద్ధవ్‌ఠాక్రే వర్గం నుంచి బయటపడి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే వర్గంలో చేరడానికి అనేకమంది నేతలు, పదాధికారులు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా శివసేన పార్టీలో సీనియర్‌ నేతగా, కట్టర్‌ శివసైనికుడిగా పేరుగాంచిన రాందాస్‌ కదం పార్టీ నేత పదవికి రాజీనామా చేసినట్లు ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. అయితే కదం ఏక్‌నాథ్‌ శిండే వర్గంలో చేరుతుండవచ్చనే ఊహగానాలు వస్తున్నాయి. తన గొంతులో ప్రాణమున్నంత వరకు తను శివసేనలోనే కొనసాగుతానని ఒకప్పుడు ప్రకటించిన కదం ఇప్పుడు ఆకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేయడం ఉద్ధవ్‌కు గట్టి షాకు తగిలినట్‌లైంది. కాగా ఇప్పటి వరకు తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై కదం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఉత్కంఠ రేపుతోంది. 
చదవండి: థాక్రేకు మరో షాక్‌.. షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు! 

బాల్‌ ఠాక్రేకు సన్నిహితునిగా... 
ఒకప్పుడు శివసేనలో తిరుగులేని నాయకుడిగా పేరు సంపాదించుకున్న సీనియర్‌ నేత రాందాస్‌ కదం దివంగత హిందు హృదయ్‌ సామ్రాట్‌ బాల్‌ఠాక్రేకు అతి సన్నిహితుడిగా మెలిగారు. ఆయన నేతృత్వంలో అనేక సంవత్సరాలు పార్టీలో కొనసాగారు. 2005–2009 వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ముఖ్యంగా సీనియర్‌ నేతల్లో కదం ఒకరు కావడంతో ఆయనపై ఉద్ధవ్‌కు అపార నమ్మకం ఉంది. చివరకు ఆయన కూడా పార్టీ పదవికి రాజీనామా చేయడం ఉద్ధవ్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రాందాస్‌ కదం కొద్దిరోజులుగా పార్టీలో అసంతృప్తితో ఉన్నారు.

దీనికి తోడు విధాన పరిషత్‌లో ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన తరువాత మరోసారి అవకాశం లభిస్తుందని ఆయన భావించారు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. అంతేగాకుండా శివసేన, బీజేపీ కూటమిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ హయాంలో కదం పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. కాని 2009లో మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనకు మంత్రి పదవి లభించలేదు. అప్పటి నుంచి కదంలో అసంతృప్తి మరింత పెరిగిపోయింది. శివసేన నుంచి బయట పడుతుండవచ్చని వదంతులు సైతం వచ్చాయి. కానీ తను కడవరకూ శివసేనలోనే కొనసాగుతానని ఆయన అప్పట్లో స్పష్టం చేశారు. అయితే సోమవారం ఆయన ఆకస్మాత్తుగా పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ ద్వారా తెలియజేయడం ఆందరికి ఆశ్చర్యానికి గురిచేసింది.  

ఉద్ధవ్‌పై రాందాస్‌ తీవ్ర వ్యాఖ్యలు.. 
మాజీ మంత్రి, శివసేన నేత రాందాస్‌ కదం పార్టీ పదవికి రాజీనామా చేసిన తరువాత పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కదం తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. గత మూడేళ్ల నుంచి నోరు మూసుకుని పార్టీలో కొనసాగుతున్నానని, బాల్‌ ఠాక్రే బతికి ఉంటే నేడు నాకు ఈ పరిస్ధితి వచ్చేది కాదని, అందుకే పార్టీ పదవికి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. బాల్‌ ఠాక్రేకు విశ్వాస పాత్రుడిని కావడంవల్లే ఆయన నాకు పార్టీలో వివిధ పదవులు కట్టబెట్టారు. ఆయన మరణించిన తరువాత నాకు విలువ లేకుండా పోయింది. ఇది నేను కొంత కాలంగా గమనిస్తున్నాను. నన్ను విశ్వాసంలోకి తీసుకోకుండానే పార్టీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా నన్ను విశ్వాసంలోకి తీసుకోలేదు.

నా కుమారుడు, ఎమ్మెల్యే యోగేశ్‌ కదంను కూడా అనేకసార్లు అవమాన పరిచారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నన్ను మాతోశ్రీ బంగ్లాకు పిలిపించారు. నీపై ఎవరు ఎలాంటి ఆరోపణలు, వ్యాఖ్యలు చేసినా మీడియా ఎదుట నోరు విప్పవద్దని హెచ్చరించారు. అప్పుడు అలా ఎందుకు హెచ్చరించారో ఇప్పటికీ నాకు అర్ధం కాలేదన్నారు. బాల్‌ ఠాక్రే బతికున్నంత కాలం ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో పోరాడుతూ హిందుత్వాన్ని బతికించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టవద్దని, హిందుత్వానికి కట్టుబడి ఉండాలని లేదంటే బాల్‌ ఠాక్రేను అవమాన పర్చినట్లవుతుందని పలుమార్లు ఉద్ధవ్‌కు విజ్ఞప్తి చేశాను. కానీ ఆయన మాటలను లెక్కచేయలేదు. ఇది కూడా తనను కలచివేసిందని కదం స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు