మళ్లీ ‘మహా’ రగడ

12 Feb, 2021 06:20 IST|Sakshi

గవర్నర్‌ VS సర్కార్‌

ప్రభుత్వ విమానం వాడుకునేందుకు గవర్నర్‌కు అనుమతి నిరాకరణ  

సాక్షి ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం, గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వ విమానంలో గవర్నర్‌ ప్రయాణించేందుకు రాష్ట్ర సర్కారు గురువారం అనుమతి నిరాకరించింది. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు డెహ్రాడూన్‌కు వెళ్లడానికి సిద్ధమైన గవర్నర్‌ ముంబై ఎయిర్‌పోర్టులో విమానంలో కూర్చున్న అనంతరం అనుమతి లేదని అధికారులు తేల్చిచెప్పారు. దాదాపు రెండు గంటల తర్వాత ప్రైవేట్‌ విమానంలో గవర్నర్‌ డెహ్రాడూన్‌కు బయల్దేరారు. ప్రభుత్వ అధికారిక విమానంలో గవర్నర్‌ ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గవర్నర్‌ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి.

మా తప్పేమీ లేదు: సీఎం ఆఫీస్‌  
ప్రభుత్వ విమానంలో గవర్నర్‌ ప్రయాణించేందుకు ఇంకా అనుమతి లభించలేదని, ఈ విషయాన్ని రాజ్‌భవన్‌కు ముందే తెలియజేశామని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. గవర్నర్‌కు ఇబ్బంది కలిగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని పేర్కొంది. ప్రయాణంపై 10 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని గవర్నర్‌ కార్యాలయం తెలియజేసింది.

మరిన్ని వార్తలు