‘షిండే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం’

4 Jul, 2022 19:14 IST|Sakshi

మహారాష్ట్రలో నూతనంగా ఏర్పాటైన బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అందుకే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజలు ఉండదని తెలిపారు.  ఇండియా టుడే కన్‍క్లేవ్‌ ఈస్ట్‌ 2022 కార్యక్రమంలో ఆమె సోమవారం మాట్లాడుతూ  ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను ఎన్నో ప్రభుత్వాలను చూశానని, కానీ ఇలాంటి ప్రతీకార ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదని మమత అన్నారు. బీజేపీ, షిండే ప్రభుత్వాన్ని గెలిచి ఉండవచ్చు కానీ మహారాష్ట్ర ప్రజల మనసుల్ని మాత్రం గెలవలేదని విమర్శలు గుప్పించారు. ఇది అనైతిక అప్రజాస్వామిక ప్రభుత్వమని మండిపడ్డారు.

'మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూల్చవచ్చు, కానీ ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్య మార్గాల్లో మిమ్నల్లి కూల్చేస్తారు. ' అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ డబ్బుతో పాటు చాలా ఇచ్చిందని ఆరోపించారు.  షిండే ప్రభుత్వం కూలిపోతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ కూడా ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే  అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.  

మరిన్ని వార్తలు