ఆయనది స్నేహం.. మోదీది ద్రోహం: ప్రధానిపై శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు

28 Jun, 2022 19:34 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలసిందే. ఇక ఈ రాజకీయ పోరులో విజయం కోసం ఒకరిపై మరొకరు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా శివసేన ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివసేనను అంతం చేయడానికి కుట్ర పన్నడం ద్వారా బాలాసాహెబ్ (బాల్ ఠాక్రే)కు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలకు వారు కూడా బాలాసాహెబ్‌కు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే కారణమని శివసేనలో అందరూ భావిస్తున్నారని, అది నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని సావంత్‌ అన్నారు. ‘‘2002 గుజరాత్ అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ బాలాసాహెబ్ వాజ్‌పేయిని అలా చేయవద్దని ఒప్పించారు. 'అగర్ మోడీ గయా, పార్టీ గయీ.' (మోడీ పోతే, బీజేపీగుజరాత్‌ను కోల్పోతుంది) అని వాజ్‌పేయికి నచ్చజెప్పారు. బాలాసాహెబ్ తన చివరి శ్వాస వరకు మోదీ స్నేహాన్ని గౌరవించారు, కానీ మోదీ మాత్రం బాలాసాహెబ్‌ని మోసం చేశారని’’ సావంత్ అన్నారు. ప్రధాని కేబినెట్‌లో భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కు కేంద్ర మంత్రిగా పనిచేసిన సావంత్, 2019లో సేన-బీజేపీ పొత్తు ముగిసిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.
చదవండి: Maharashtra: వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే?

మరిన్ని వార్తలు