Maharashtra political crisis: అదే సస్పెన్స్‌

25 Jun, 2022 05:49 IST|Sakshi
గువాహటిలోని హోటల్లో రెబల్‌ శివసేన ఎమ్మెల్యేలతో షిండే

తిరుగుబాటు నేత షిండే వైపు 40 మంది సేన ఎమ్మెల్యేలు, డజను స్వతంత్రులు

పార్టీ ఏం తక్కువ చేసిందంటూ షిండేపై సీఎం ఉద్ధవ్‌ ధ్వజం

ఠాక్రే పేరు లేకుండా రాజకీయాల్లో మనగలవా అంటూ సవాలు

పవార్‌తో సుదీర్ఘ మంతనాలు నేడు సేన జాతీయ కార్యవర్గ భేటీ

ముంబై: శివసేనలో చిచ్చు నేపథ్యంలో మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే బలం మరింత పెరుగుతోంది. పాలక మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమికి నేతృత్వం వహిస్తున్న సేనపై ఆయన తిరుగుబాటు చేయడం, తన తన వర్గం ఎమ్మెల్యేలతో మూడు రోజులుగా గౌహతిలోని హోటల్లో మకాం వేయడం తెలిసిందే. ఆయన శిబిరంలో ఇప్పటికే 37 మంది సేన ఎమ్మెల్యేలుండగా శుక్రవారం మరో ఎమ్మెల్యే దిలీప్‌ లాండే వెళ్లి చేరారు.

వీరికి తోడు మరో 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా షిండే శిబిరంలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంకా సాగదీయడం కూటమికి నగుబాటే తప్ప ఒరిగేదేమీ ఉండదని ఎంవీఏ భాగస్వామి ఎన్సీపీ భావిస్తున్నట్టు సమాచారం. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ శుక్రవారం రాత్రి శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మరోవైపు 16 మంది రెబల్‌ ఎమ్మెల్యేలను అనర్హుత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్‌ నరహరిని ఉద్ధవ్‌ కోరారు. షిండేతో పాటు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా దీనిపై మండిపడ్డారు. డిప్యూటీ సీఎం ఉద్ధవ్‌కు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, ఆయన్ను తప్పించాలని షిండే డిమాండ్‌ చేశారు.

అదను చూసి తిరుగుబాటు: ఉద్ధవ్‌
షిండేపై తొలిసారిగా ఉద్ధవ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండేళ్లుగా తనను అనారోగ్యం వేధిస్తున్న నేపథ్యంలో ఇదే అదనని భావించి ఆయన తిరుగుబాటుకు దిగారంటూ దుయ్యబట్టారు. పార్టీ నీకేం తక్కువ చేసింది అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేల రూపంలో ఎన్నికల ఫలాలను షిండే లాగేసుకున్నా కార్యకర్తల రూపంలో కీలకమైన పార్టీ మూలాలు మాత్రం తమ వద్దే ఉన్నాయన్నారు. 

తాజా సంక్షోభం వెనక బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు.‘‘శివసేన నుంచి ఠాక్రేలను వేరు చేయడం ఎవరి తరమూ కాదు. మనవెంట ఎవరూ లేరనే భావిద్దాం. శివసేనను కొత్తగా నిర్మించుకుందాం’’ అని కార్యకర్తలను పిలుపునిచ్చారు. తాను వీడింది సీఎం బంగ్లా మాత్రమే తప్ప పట్టుదలను, పోరాట పటిమను కాదన్నారు. గతంలోనూ ఇలాంటి తిరుగుబాట్లు జరిగినా పార్టీ మళ్లీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 

నాతోనే 40 మంది: షిండే
మరోవైపు షిండే గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ తమదే అసలైన శివసేన అని పునరుద్ఘాటించారు. ‘‘55 మంది సేన ఎమ్మెల్యేల్లో 40 మంది నాతోనే గౌహతిలో ఉన్నారు. 12 మంది స్వతంత్రులూ మా వైపున్నారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలమే ముఖ్యం. అది మాకుంది గనుక మాపై చర్య తీసుకునే అధికారం ఎవరికీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. మహా శక్తి అయిన జాతీయ పార్టీ ఒకటి తనకు మద్దతుగా ఉందని గురువారం చెప్పిన షిండే శుక్రవారం మాట మార్చారు. ఏ జాతీయ పార్టీ తమతో టచ్‌లో లేదన్నారు. తానన్న మహా శక్తి శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే, పార్టీలో తన గురువు ఆనంద్‌ డిఘే అని చెప్పుకొచ్చారు. రాజకీయ సంక్షోభానికి త్వరలోనే తెర పడుతుందని చెప్పారు. ఆయన గౌహతి నుంచి ముంబై బయల్దేరుతున్నట్టు సమాచారం. మరోవైపు షిండేతో పాటు రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యకర్తల నివాసాలపై శివసేన కార్యకర్తలు దాడులు చేయొచ్చన్న వార్తల నేపథ్యంలో ముంబైలోనూ, రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
 

మరిన్ని వార్తలు