Maharashtra Political Crisis: ముదురు పాకాన...

26 Jun, 2022 02:29 IST|Sakshi
థానెలో ఏక్‌నాథ్‌ షిండే నివాసం వద్ద నినాదాలు చేస్తున్న ఆయన మద్దతుదారులు

మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర సంక్షోభం 

ముంబై:  మహారాష్ట్రలో అధికార కూటమి సారథి శివసేనలో ఇంటి పోరు మరింత ముదురుతోంది. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో రాష్ట్రంలో మంగళవారం మొదలైన రాజకీయ సంక్షోభం నానా మలుపులు తిరుగుతోంది. షిండే సారథ్యంలో నాలుగు రోజులుగా అసోంలోని గౌహతిలో హోటల్లో మకాం చేసిన 40 మందికి పైగా సేన రెబల్‌ ఎమ్మెల్యేలు తమది శివసేన (బాలాసాహెబ్‌) వర్గమని ప్రకటించుకున్నారు.

తామేమీ పార్టీని వీడటం లేదని, షిండే సూచించిన మేరకు తమ వర్గానికి ఓ పేరు మాత్రం పెట్టుకున్నామని స్పష్టం చేశారు. సభలోనూ అదే పేరిట కొనసాగుతామనే సంకేతాలిచ్చారు. రెబల్స్‌ తరఫున ఎమ్మెల్యే దీపక్‌ కేసర్కర్‌ శనివారం వర్చువల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్ధవ్‌పై తమకేమీ వ్యతిరేకత లేదన్నారు. ‘‘కానీ 55 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో ఆయన వైపున్న వారి సంఖ్య 15 కంటే తక్కువకు పడిపోయింది. మూడింట రెండొంతుల మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో గళమెత్తుతున్నామంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ఆయనే అర్థం చేసుకోవాలి.

పార్టీని హైజాక్‌ చేసింది మేం కాదు, అధికార కూటమి భాగస్వాములైన ఎన్సీపీ, కాంగ్రెస్‌. వాటి బారినుంచి పార్టీని కాపాడుకోవడమే మా ఉద్దేశం’’ అన్నారు. ఉద్ధవ్‌ ఇప్పటికైనా ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పి బీజేపీతో చేతులు కలపాలని డిమాండ్‌ చేశారు. పార్టీకి మద్దతు ఉపసంహరిస్తారా అని ప్రశ్నించగా తమదే అసలైన శివసేన అని చెప్పుకొచ్చారు. ‘‘ఈ ఒత్తిళ్లలో ముంబై తిరిగి రావడం క్షేమం కాదు. సరైన సమయంలో తిరిగొస్తాం’’ అని ప్రకటించారు.

శివసేన శాసనసభాపక్ష నేతగా షిండేను గుర్తించాలన్న తమ లేఖను డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడాన్ని ఖండించారు. ‘‘ప్రభుత్వానే ఉద్ధవ్‌ నెలల తరబడి ఆన్‌లైన్‌ మీటింగులతో నడిపిస్తున్నారు. కనుక డిప్యూటీ స్పీకర్‌నూ ఆన్‌లైన్‌ మీటింగ్‌ పెట్టమనండి. మా బలం నిరూపించుకుంటాం’’ అని సవాలు చేశారు. జూన్‌ 30 దాకా వాళ్లు గౌహతి హోటల్లోనే ఉంటారని సమాచారం.

సంకీర్ణ కొండచిలువ విషకౌగిలి నుంచి శివసైనికులను విముక్తులను చేసేందుకే పోరాడుతున్నానంటూ శనివారం రాత్రి పొద్దుపోయాక షిండే ట్వీట్‌ చేశారు. శివసేన కార్యకర్తలంతా దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఆయన శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని వడోదర వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినట్టు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు మహారాష్ట్ర విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు అందులో పాల్గొన్నట్టు చెబుతున్నారు.

ముంబైలో 144 సెక్షన్‌
మరోవైపు ఉద్ధవ్‌ నేతృత్వంలో శివసేన జాతీయ కార్యవర్గ భేటీ జరిగింది. రెబల్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారాన్ని సభ్యులంతా ఉద్ధవ్‌కు కట్టబెట్టారు. శివసేన, బాలాసాహెబ్‌ ఠాక్రే పేరు ఎవరూ వాడుకోవడానికి వీల్లేదంటూ తీర్మానం చేశారు. శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఉద్ధవ్‌కు సంఘీభావం ప్రకటించారు. శివ సైనికులను వీధుల్లోకి వదులుతామంటూ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ ప్రకటన చేశారు. దమ్ముంటే ముంబై వచ్చి పార్టీని ఎదుర్కోవాలని షిండేకు సవాలు విసిరారు. సత్యాసత్యాల మధ్య పోరాటంలో గెలుపు తమదేనని ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే అన్నారు.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పలువురు రెబల్‌ ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల వద్ద భారీ నిరసనలకు, దాడులకు దిగారు. పలువురి కార్యాలయాలను ధ్వంసం చేశారు. తనతో పాటున్న 38 మంది రెబల్‌ ఎమ్మెల్యేల కుటుంబాలకు పోలీసులు కావాలనే భద్రత ఉపసంహరించారని షిండే ఆరోపించారు. వీటిని హోంమంత్రి దిలీప్‌ వాస్లే పాటిల్‌ ఖండించారు. ఉద్రిక్తత నేపథ్యంలో ముంబైలో జూలై 10 దాకా 144 సెక్షన్‌ విధించారు. ఉద్ధవ్‌ ఫిర్యాదు మేరకు 16 మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్‌ అనర్హత నోటీసులు పంపారు. సోమవారం సాయంత్రంలోగా  స్పందించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు