Uddhav Thackeray Removes Shinde: ఏక్‌నాథ్‌ షిండే ఇక శివసేన నేత కాదు.. అధికారిక ప్రకటన

2 Jul, 2022 08:02 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు.. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఝలక్‌ ఇచ్చారు. షిండేను శివసేన పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారాయన.  పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడినందుకుగానూ తొలగిస్తున్నట్లు శుక్రవారం ఓ అధికారిక లేఖ ద్వారా షిండేకు థాక్రే తెలియజేశారు. 

శివసేన పక్ష ప్రముఖ హోదాలో ఉద్దవ్‌ థాక్రే, ఏక్‌నాథ్‌ షిండేను శుక్రవారం సాయంత్రం పార్టీ నుంచి తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడినందుకుగానూ స్వచ్ఛందంగా ఆయన(షిండే) తన సభ్యత్వాన్ని కోల్పోయారని, ఇకపై పార్టీలోని ఏ పదవిలోనూ(ప్రాథమిక సభ్యత్వంతో సహా) ఆయన ఉండబోరని లేఖలో థాక్రే వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మెజార్టీ ఎమ్మెల్యేలతో మద్దతుతో తనదే సిసలైన శివసేన వర్గంగా ప్రకటించుకున్న ఏక్‌నాథ్‌ షిండే.. పార్టీ చీఫ్‌గా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. 

కాకపోతే బాల్‌థాక్రేకు తానే నిజమైన రాజకీయ వారసుడిగా పేర్కొంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.  ఈ మేరకు తన ట్విటర్‌ అకౌంట్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌ను మార్చేసుకున్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం మాత్రం తమదే అసలైన శివసేన అంటూ సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా పేర్కొంది. ఈ పంచాయితీ ఎటూ తేలని తరుణంలో.. సాంకేతికంగా ఇప్పటికీ ఉద్దవ్‌ థాక్రే నే శివసేన అధినేతగా కొనసాగుతున్నారు.

బీజేపీ మద్ధతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిండే.. మెజారిటీని నిరూపించుకునేందుకు బలపరీక్షను ఎదుర్కొన్నారు. ఇందుకోసం జూలై 2 నుంచి మహారాష్ట్ర శాసనసభలో రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.

చదవండి: ఫడ్నవిస్‌ అసంతృప్తి.. బీజేపీ సంబురాలకు దూరం!

మరిన్ని వార్తలు