శివసేన అనర్హత అస్త్రం‌.. దూకుడు పెంచిన షిండే, 50కి చేరువగా రెబల్స్‌!

24 Jun, 2022 09:13 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక మలుపులే చోటు చేసుకుంటున్నాయి. రెబల్స్‌పై అంతిమంగా అనర్హత అస్త్రం ప్రయోగించింది శివసేన. ఈ మేరకు ఏక్‌నాథ్‌ షిండే సహా 11 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ దాఖలు చేసి.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌కు అందజేసింది.

అయితే ఏక్‌నాథ్‌ షిండే మాత్రం అనర్హత వేటుకు జంకేదే లేదని స్పష్టం చేశారు. భయపెట్టడానికి మీరెవరు?.. చట్టం కూడా తమకు అనుకూలంగానే ఉందంటూ వరుసగా ట్విటర్‌లో పోస్టులు చేశారాయన. ఆపై మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌కు ఏక్‌నాథ్‌ షిండే లేఖ రాశారు. శివసేన లేజిస్లేచర్‌ పార్టీ నేతగా ఏక్‌నాథ్‌ షిండే నియామకంతో పాటు పార్టీ చీఫ్‌ విప్‌గా బి.గోల్వేల్‌ నియామకంపై కూడా లేఖలో వివరణ ఇచ్చారు షిండే. గవర్నర్‌తో పాటు ఆ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి కూడా పంపారు.

ఇదిలా ఉంటే.. శివ సేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే వైపు మరికొందరు ఎమ్మెల్యేలు తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు ఆయన వర్గంలో అధికారికంగా ఉన్నారు. తాజాగా మరొ ఇద్దరు క్యాంప్‌నకు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఎమ్మెల్యేలే కాకుండా.. ఎంపీలు సైతం రెబల్స్‌లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. 

ఈ మేరకు ఏక్‌నాథ్‌ షిండే ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. యాభై మంది ఎమ్మెల్యేలు మద్దతు తమకు ఉందని, అందులో నలభై మంది శివ సేన ఎమ్మెల్యేలేనని ఆయన చెప్తున్నారు.

మరిన్ని వార్తలు