MVA Crisis: కుళ్లిన ఆకుల్ని ఏరేయాల్సిందే.. కలిసి నడిస్తే బీజేపీ మమ్మల్నే తుడిచేయాలనుకుంటోంది!

25 Jun, 2022 07:53 IST|Sakshi

మహా రాజకీయ సంక్షోభంలో ఇవాళ(శనివారం) సాయంత్రం కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు 40 మంది శివ సేన ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారంటూ ప్రకటించిన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే.. సాయంత్రంలోగా సంఖ్యా బలం ఆధారంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉండగా.. మరోవైపు శివసేన జాతీయ కార్యవర్గ భేటీ ఈ సంక్షోభాన్ని ఒక కొలిక్కి తీసుకురావొచ్చని.. కార్యకర్తలు ధీమాగా ఉన్నారు.

అయితే.. శుక్రవారం పొద్దుపోయాక తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే, రెబల్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే. తన అనారోగ్యాన్ని అదనుగా తీసుకుని.. తిరుగుబాటు మొదలుపెట్టారని మండిపడ్డారు.  ‘‘షిండేను సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చి ఉంటే సరే. కానీ కేవలం ఉప ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన ఇదంతా చేస్తున్నట్టయితే మాత్రం పదవిని మేమే ఇచ్చేవాళ్లం అని పేర్కొన్నారు. 

శివసేనలో సొంత మనుషులే ఎప్పుడూ ద్రోహానికి పాల్పడుతుంటారు. అర్హులైన శివసైనికులను కాదని రెబల్‌ ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్లే సేనకు నష్టం కలిగించాలని చూస్తున్నారు.. వాళ్లపై వేటు ఖాయం అన్నారు థాక్రే. బీజేపీని అంతా అంటరానిదిగా భావించిన రోజుల నుంచీ ఆ పార్టీతో కలిసి నడిచాం. ప్రతిఫలంగా శివసేననే తుడిచిపెట్టేయాలని చూస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘థాక్రే పేరు వాడకుండా రాజకీయాల్లో మనగలవా? పార్టీ నీకేం తక్కువ చేసింది. రెండుసార్లు మంత్రిని చేసింది. నీకు కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ, నీ కుమారుడు ఎంపీ. నా కుమారుడు మాత్రం రాజకీయంగా ఎదగొద్దా?’’అంటూ ఏక్‌నాథ్‌ షిండేను నిలదీశారు. ఎమ్మెల్యేల రూపంలో ఎన్నికల ఫలాలను షిండే లాగేసుకున్నా కార్యకర్తల రూపంలో కీలకమైన పార్టీ మూలాలు మాత్రం తమ వద్దే ఉన్నాయన్నారు. 

శివ సేన అనే మహావృక్షం నుంచి కుళ్లిన ఆకులను తొలగించి పడేయాల్సిందేనన్నారు. బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ.. ‘‘శివసేన నుంచి ఠాక్రేలను వేరు చేయడం ఎవరి తరమూ కాదు. మనవెంట ఎవరూ లేరనే భావిద్దాం. శివసేనను కొత్తగా నిర్మించుకుందాం’’ అని కార్యకర్తలను పిలుపునిచ్చారు. తాను వీడింది సీఎం బంగ్లా మాత్రమే తప్ప పట్టుదలను, పోరాట పటిమను కాదన్నారు. గతంలోనూ ఇలాంటి తిరుగుబాట్లు జరిగినా పార్టీ మళ్లీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

చదవండి: మాట మార్చిన షిండే.. బీజేపీకి సంబంధం లేదా?

మరిన్ని వార్తలు