Maharashtra Political Crisis: తెగని పంచాయితి.. మహారాష్ట్రలో ఆ 16 మంది ఎమ్మెల్యేల పరిస్థితేంటి?

4 Jul, 2022 11:56 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్‍నాథ్ షిండే వర్గంతో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన ఎమ్మెల్యేలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించినందుకు ఠాక్రే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని శివసేన (షిండే వర్గం) చీఫ్ విప్‌ భరత్‌ గోగావలే అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్ అందించారు. నిబంధనలను అతిక్రమించినందుకు వారిపై చర్యలు తోసుకోవాలని కోరారు. 

దీంతో ఠాక్రే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలకు సస్పెన్షన్ నోటీసులు జారీ చేయనున్నట్లు స్పీకర్‌ కార్యాలయం వెల్లడించింది. సీఎం ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన స్పీకర్‌ ఎన్నికలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాలు పార్టీ ఎమ్మెల్యేలకు వేర్వేరు విప్‌ జారీ చేశాయి. 
చదవండి👉Maharashtra political crisis: విల్లు బాణమెవరికో?

షిండే వర్గం బీజేపీ అభ్యర్థి రాహుల్‌ నర్వేకర్‌గా అనుకూలంగా, ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి రాజన్‌ సాల్వీకి అనుకూలంగా ఓటు వేశాయి. రాహుల్ నర్వేకర్‌కు 164 ఓట్లు రాగా, మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్‌ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి. 

స్పీకర్ ఎన్నిక అనంతరం పార్టీ విప్‌ను కొందరు సభ్యులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ శివసేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు(ఠాక్రే వర్గం) డిప్యూటీ స్పీకర్‌కు ఓ లేఖ అందజేశారు. పార్టీ ఆదేశాలను 39 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని సభలో సునీల్‌ ప్రభు చెప్పారు. ఠాక్రే వర్గంలోని 16 ఎమ్మెల్యేలే పార్టీ విప్‌ను ధిక్కరించారని షిండే వర్గం చీఫ్ విప్‌.. స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వారిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలున్నాయి.
చదవండి👉బల పరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం

మరిన్ని వార్తలు