Shiv Sena: ప్రతిపక్ష పదవి మాకే కావాలి.. ఎన్సీపీ, కాంగ్రెస్‌పై శివసేన ఒత్తిడి

11 Jul, 2022 13:06 IST|Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్ర విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేత పదవి కావాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది. అందుకు మహా వికాస్‌ ఆఘాడిలో శివసేన మిత్రపక్షాలైన కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) లపై ఒత్తిడి చేయనున్నట్లు విధాన పరిషత్‌తో శివసేనకు చెందిన నూతన సభ్యుడు సచిన్‌ అహిర్‌ వెల్లడించారు. ఇటీవల శివసేన నేత ఏక్‌నాథ్‌ శిందే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంతో మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

దీంతో మహావికాస్‌ ఆఘాడి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ తరువాత విధాన మండలి (అసెంబ్లీ)లో ప్రతిపక్ష పదవి నేతగా ఎన్సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో విధాన్‌ పరిషత్‌లో ప్రతిపక్ష నేత పదవి తమకే దక్కాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది. విధాన పరిషత్‌లో కాంగ్రెస్, ఎన్సీపీతో పోలిస్తే శివసేనకు సంఖ్యా బలం ఎక్కువ ఉంది. దీంతో ప్రతిపక్ష నేత పదవి కోసం పట్టుబట్టేందుకు శివసేనకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఇరు పార్టీల కంటే శివసేనకు 13 మంది ఎమ్మెల్సీల సంఖ్యా బలం ఎక్కువ ఉంది. దీంతో ఈనెల చివరి వారంలో జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత పదవి తమకే కావాలని డిమాండ్‌ చేయనున్నట్లు అహిర్‌ పేర్కొన్నారు.
చదవండి: పన్నీర్‌ సెల్వానికి భారీ షాక్‌.. పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం

40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందే, ఆయన మద్దతుదారులు ఎన్ని కుయుక్తులు పన్నినా విల్లు, బాణం (ధనుశ్య, బాణ్‌) గుర్తు అసలైన శివసేన వద్ద అంటే సుమారు 55 ఏళ్ల కిందట హిందు హృదయ్‌ సమ్రాట్‌ దివంగత బాల్‌ ఠాక్రే స్ధాపించిన శివసేన వద్ద, ఆయన వారసులైన ఉద్ధవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే వద్దే శాశ్వతంగా ఉంటుందని అహిర్‌ స్పష్టం చేశారు. శిందే తిరుగుబాటుతో పార్టీలో నెలకొన్న గందరగోళంవల్ల అనేక మంది శివసైనికుల ఆత్మస్ధైర్యం దెబ్బతింది. దీంతో అదే దూకుడు, ఉత్సాహం, ఊపుతో, మానసికంగా బలపడి శివసేన కొత్త పుంతలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తుందని సచిన్‌ అహిర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 
చదవండి: వివాదాస్పద వీడియో.. బీజేపీ మహిళా నేత అరెస్ట్‌ 

మరిన్ని వార్తలు