ఇరు‘సేన’లకూ నోటీసులు.. వారంలోగా బదులివ్వాలి: స్పీకర్‌

9 Jul, 2023 07:42 IST|Sakshi

ముంబై: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో శివసేన షిండే వర్గానికి చెందిన 40 మంది, యూబీటీ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చినట్టు మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ శనివారం వెల్లడించారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లకు ఏడు రోజుల్లోగా బదులివ్వాల్సిందిగా కోరినట్టు వివరించారు. వీరిలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, యూబీటీ వర్గం నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులున్నారు.

గతేడాది శివసేనలో చీలిక అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంబీటీ వర్గానికి చెందిన రుతుజా లాట్కేకు నోటీసులు ఇవ్వలేదు. శివసేన నియమావళి తాలూకు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందుకున్నట్టు, షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ త్వరలో మొదలవుతుందని స్పీకర్‌ శుక్రవారం వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

అయితే తమకింకా ఎలాంటి నోటీసులూ రాలేదని సేన ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి సంజయ్‌ షిర్సత్‌ తెలిపారు. షిండే వర్గంపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై వేగవంతంగా విచారణ జరిపేలా స్పీకర్‌ను నిర్దేశాలు జారీ చేయాలంటూ కొద్ది రోజుల క్రితం సేన (యూబీటీ) వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ‘గత రెండు నెలలుగా ఈ విషయంలో స్పీకర్‌ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చింది’ అని యూబీటీ నేత అర్వింద్‌ సావంత్‌ చెప్పారు.

ఇదీ చదవండి: అబద్ధాల బజార్‌లో దోపిడీ దుకాణం

మరిన్ని వార్తలు